Amaravati Hotels : అమరావతికి స్టార్ హోటళ్ల కళ
Amaravati Hotels : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఆధునిక మౌలిక సదుపాయాలతో పాటు పర్యాటక, ఆతిథ్య రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ హోటల్ చైన్లకు అవకాశాలు కల్పిస్తోంది
- By Sudheer Published Date - 06:22 PM, Fri - 17 October 25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఆధునిక మౌలిక సదుపాయాలతో పాటు పర్యాటక, ఆతిథ్య రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ హోటల్ చైన్లకు అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలో దసపల్లా గ్రూప్ రూ.200 కోట్ల పెట్టుబడితో, SGHRL సంస్థ రూ.177 కోట్లతో నాలుగు స్టార్ స్థాయి హోటళ్లను అమరావతిలో నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టులు పూర్తవుతే రాజధానిలో అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
పర్యాటక, వసతి సౌకర్యాలను విస్తరించడానికి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం సమీపంలోని అరకులో ప్రముఖ సంస్థ VHR రూ.56 కోట్ల వ్యయంతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మించేందుకు ప్రతిపాదించింది. ఈ రిసార్టులు అరకులో పర్యాటక ఆకర్షణను మరింత పెంచడమే కాకుండా, స్థానిక ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తాయని అధికారులు తెలిపారు. పచ్చని ప్రకృతి, పర్వత ప్రాంత సౌందర్యం మధ్య సరికొత్త పర్యాటక అనుభవం అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు రకాల రాయితీలు ప్రకటించింది. కొత్తగా నిర్మించే హోటల్, రిసార్ట్స్ ప్రాజెక్టులకు 10 ఏళ్ల పాటు SGST మినహాయింపు, 5 ఏళ్ల వరకు విద్యుత్ డ్యూటీ మినహాయింపు కల్పించే ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిర్ణయాలతో ఆతిథ్య రంగం మరింత ఉత్సాహం పొందే అవకాశం ఉంది. అమరావతి, అరకు వంటి ప్రాంతాలను ప్రపంచ పర్యాటక పటంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బలాన్నిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.