Vijayawada Durga Temple: దుర్గ గుడి లో సిబ్బంది చేతివాటం
- Author : Vamsi Chowdary Korata
Date : 31-03-2026 - 11:17 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించి దొరికిపోయారు. హుండీ లెక్కింపులో భక్తులు సమర్పించిన బంగారాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. వీరు హుండీల్లోని అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్‌గా మార్చేందుకు ప్లాన్ చేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. అప్పుడు వీరి ఘనకార్యం బయటపడింది. బాధ్యులైనవారికి ఆలయ ఈవో మెమోలు జారీ చేశారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ఆలస్యంగా బయటపడింది. హుండీల కానుకల లెక్కింపులో సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. భక్తులు సమర్పించిన బంగారాన్ని రోల్డ్‌గోల్డ్ పేరుతో దారి మళ్లించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల్ని లెక్కిస్తుంటారు. అయితే ఆలయ సిబ్బంది హుండీ కానుకల్లో సమర్పించిన అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కన పెట్టి అక్రమంగా తీసుకెళ్లాలని పథకం వేశారు. రోల్డ్‌గోల్డ్ పేరుతో బంగారం పక్కన పెట్టడంపై ఆలయ పాలకమండలి సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ బంగారాన్ని తనిఖీ చేయడంతో వీరి గుట్టు బయటపడింది.
పాలకమండలి సభ్యుల తనిఖీల్లో దాదాపు రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆలయ సిబ్బంది ఘనకార్యంపై ఈవో శీనా నాయక్ సీరియస్‌గా స్పందించారు. బంగారాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసిన సిబ్బందికి మెమోలు జారీ చేశారు. వారిపై తదుపరి చర్యలు ఉంటాయన్నారు. దీనిపై ఈవో సమగ్ర విచారణకు ఆదేశించారు. వాస్తవానికి దుర్గమ్మ ఆలయంలో హుండీలు లెక్కించే సమయంలో సీసీ కెమెరాలతో పాటుగా త్రిసభ్య కమిటీ పర్యవేక్షణ కూడా ఉంటుంది. అయినా సరే సిబ్బంది బంగారాన్ని మాయం చేసే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు హుండీలలో కానుకల్ని సమర్పిస్తుంటారు. డబ్బులతో పాటుగా బంగారం, వెండి వంటి వస్తువుల్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ హుండీలను ఆలయంలోనే లెక్కిస్తుంటారు. సీసీ కెమెరాలతో పాటుగా అధికారుల పర్యవేక్షణ కూడా ఉంటుంది. అయినా సరే ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఈవో శీనా నాయక్ సీరియస్‌గా ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఆరా తీస్తున్నారు. అధికారులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించే అవకాశం ఉంది. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవంటున్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో కలకలం రేపిన ఈ రోల్డ్‌గోల్డ్ ఎపిసోడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.