Ponguleti Srinivas Reddy: సీఎం జగన్ ని కలిసిన పొంగులేటి
తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో జాయిన్ అయ్యారు.
- Author : Praveen Aluthuru
Date : 06-07-2023 - 7:32 IST
Published By : Hashtagu Telugu Desk
Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో జాయిన్ అయ్యారు. ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభా వేదికగా పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉండగా తాజాగా పొంగులేటి తెలంగాణ రాజకీయాలను పక్కనపెట్టి ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించారు.
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా ఇద్దరి మధ్య తెలంగాణ రాష్ట్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా తాజా రాజకీయలు చర్చలోకి వచ్చినట్టు సమాచారం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట ఆయన ప్రధాన అనుచరుడు, ఖమ్మం నగరంలోని 27 డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ దొడ్డ నగేష్ కూడా పాల్గొన్నారు. అయితే సీఎం జగన్‌తో పొంగులేటి సమావేశం కావడం రాజకీయ చర్చకు దారితీసింది.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుందన్న వార్తలు వస్తున్న తరుణంలో పొంగులేటి సీఎం జగన్ తో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అయితే పొంగులేటి సీఎం జగన్ తో భేటీ వ్యక్తిగతమని మరికొందరు భావిస్తున్నారు. ఆయన వ్యాపారాల విషయమై పొంగులేటి జగన్ తో భేటీ అయినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Read More: Xiaomi Mix Fold 3: షావోమి నుంచి మార్కెట్ లోకి మడతపెట్టె ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?