‘People first’ – Chandrababu : ‘పీపుల్ ఫస్ట్’ మన విధానం – చంద్రబాబు
'People first' - Chandrababu : ప్రజా సమస్యలను ఒక అధికారిలా కాకుండా.. మానవతా కోణంలో చూడాలని , ప్రజలతో మన ప్రవర్తన మర్యాద పూర్వకంగా ఉండాలని, మనం మంచి పనులు చేస్తే ప్రజలు కచ్చితంగా అభినందిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు
- By Sudheer Published Date - 04:00 PM, Wed - 11 December 24

రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారులా కాకుండా ప్రజాసేవకుడిలా పనిచేయాలని, ‘పీపుల్ ఫస్ట్’ (People first) అనేది మన విధానమని, ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ’ మన నినాదం కావాలని సీఎం చంద్రబాబు (CM CHandrababu) జిల్లాల కలెక్లర్లతో అన్నారు. ప్రజా సమస్యలను ఒక అధికారిలా కాకుండా.. మానవతా కోణంలో చూడాలని , ప్రజలతో మన ప్రవర్తన మర్యాద పూర్వకంగా ఉండాలని, మనం మంచి పనులు చేస్తే ప్రజలు కచ్చితంగా అభినందిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సమస్యలు తెలుసుకోవడం, ప్రజల వినతుల వేగంగా పరిష్కరించడం అధికారుల ప్రథమ ప్రాధామ్యాలుగా ఉండాలన్నారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో రెండవ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి గడిచిన 6 నెలల పాలనపైనా, భవిష్యత్ ప్రణాళికలపైనా చర్చించారు. గత ప్రభుత్వానికి సంబంధించి రూ. 10 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లడమే కాకుండా, రాష్ట్ర నిధులను ముందుగానే వినియోగించడంతో ఏర్పడిన ఆర్థిక సమస్యలను అధిగమించామని అన్నారు. ప్రస్తుతం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటున్నామని చెప్పుకొచ్చారు.
మాఫియాలను నిర్మూలించే లక్ష్యంతో ప్రభుత్వం :
గత ప్రభుత్వ హయాంలో వ్యాపించిన భూ అక్రమాలు, లిక్కర్ మాఫియా, ఇసుక దోపిడీ, గంజాయి సాగు వంటి నేరాలను తుదముట్టించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు. కూకటి వేళ్లతో సహా ఇలాంటి అక్రమాలను నిర్మూలించి, రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తిరిగి తీసుకురావాలన్నారు. ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించడానికి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెట్టుబడులు, ఐటీ అభివృద్ధికి ప్రాధాన్యత :
రాష్ట్రంలో పెట్టుబడుల రాక కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయని సీఎం వెల్లడించారు. డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీ కేబుల్ వంటి సదుపాయాలు విశాఖపట్నం రూపురేఖలను మార్చి, రాష్ట్రానికి గేమ్ చేంజర్‌గా నిలుస్తాయని తెలిపారు.
సమస్యలకు శాశ్వత పరిష్కారాలు :
రాష్ట్ర ప్రజల నుంచి వచ్చే 60% వినతులు భూ సమస్యల గురించి ఉండడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్‌ను తీసుకువచ్చామని సీఎం చెప్పారు. భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. సమస్యలు పరిష్కరించడంలో అధికారం తీరును మార్పు చేయాలని సూచించారు.
విజన్ 2047తో స్వర్ణాంధ్ర లక్ష్యం :
రాష్ట్ర అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను ప్రకటించామని, దీనిలో భాగంగా జిల్లా, మండలం, పంచాయతీ స్థాయిలో ప్రణాళికలు రూపొందించామని సీఎం తెలిపారు. 15% వృద్ధి రేటును సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. సంక్రాంతి నాటికి రహదారుల మరమ్మతులు పూర్తిచేయడం వంటి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టామని వెల్లడించారు.
Read Also : AP DGP: ఏపీకి త్వరలో కొత్త డీజీపీ.. మొదలైన కసరత్తు? రేసులో ఎవెరెవరంటే?