AP DGP: ఏపీకి త్వరలో కొత్త డీజీపీ.. మొదలైన కసరత్తు? రేసులో ఎవెరెవరంటే?
ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో కొత్త డీజీపీ వచ్చే అవకాశం కనపడుతుంది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు సర్వీస్ ఈ నెల చివరి నాటికి పూర్తి అవనుంది. అయితే, ఆయన సర్వీస్ పొడిగింపు ఉంటుందా, లేదా? లేకుంటే అయన రిటైర్ అవుతారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఒకవేళ ఆయన రిటైర్ అయితే, ఆ పోస్టులో అతని స్ధానంలో ఎవరు ఉంటారనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
- By Kode Mohan Sai Published Date - 03:34 PM, Wed - 11 December 24

AP DGP : కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల చివరిలో రిటైర్ కానున్నారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం లేదు అని తెలుస్తోంది. సాధారణంగా, చీఫ్ సెక్రటరీ పదవీకాలాన్ని పొడిగించడం మామూలు ప్రక్రియ, కానీ డీజీపీ పదవీకాలం పొడిగించడమే కష్టం కేంద్ర హోంశాఖ పర్మిషన్ కావాలి. ఈ నేపధ్యంలో, ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం పొడిగింపునకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తారా లేదా, మరొకరికి ఛాన్స్ ఇవ్వడానికీ సిద్ధం అవుతారా అన్న ప్రశ్నకు సమాధానం త్వరలో తేలనుంది. ఇప్పటికే, ఆయన రిటైర్మెంట్ డేట్ పై సీఎఫ్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ అధికారుల్లో అత్యంత సీనియర్ ద్వారకా తిరుమలరావు. ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా తప్పించింది. నిజానికి ఆయన సీనియార్టీలో అసలు టాప్ టెన్ లోనే లేరు.
నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మనోజ్ ని అనుకుని ఆయనను అందలం ఎక్కించారు. ఎన్నికల సమయంలో ఈసీ ఆయనను తప్పించి సీనియర్టీలో మొదటిస్థానంలో ఉన్న ద్వారకా తిరుమలరావును కూడా కాదని హరీష్ కుమార్ గుప్తాకు ఛాన్స్ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తరవాత కొన్నాళ్లు హరీష్ కుమార్ గుప్తానే డీజీపీగా ఉన్నారు. కానీ తర్వాత ద్వారకా తిరుమలరావుకు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు.
ఇప్పుడు, చంద్రబాబు డీజీపీ నియామకంలో నిబంధనల ప్రకారం వెళ్తారని, సీనియార్టీని గౌరవించి, అదే సమయంలో సమర్ధతను కూడా కాపాడుకుంటారని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీనియార్టీ ఉన్నా, అంచనాలకు అనుగుణంగా పని చేయని వ్యక్తికి సీఎం చంద్రబాబు పదవి ఇవ్వరు అని అందరూ భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ద్వారకా తిరుమలరావు తరువాత హరీష్ గుప్తా డీజీపీగా అవకాశం పొందే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అయితే, వైసీపీ ప్రభుత్వంలో, గౌతమ్ సవాంగ్ లేదా రాజేంద్రనాథ్ రెడ్డి వంటి విచ్చలవిడిగా వ్యవహరించే వారికీ అవకాశం ఉండదని అనుకుంటున్నారు.