YSRCP : అనంతపురం జిల్లాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్.. తేల్చి చెప్పిన వైసీపీ అధిష్టానం
- Author : Prasad
Date : 30-12-2023 - 7:45 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీలో టికెట్ల లొల్లి కొనసాగుతున్న ఇప్పటికే చాలామంది సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వడంలేదనే సంకేతాలు అధిష్టానం నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలు తమ భవిష్యత్ కార్యచరణ వైపు అడుగులు వేస్తున్నారు. తొలి విడతలో 11 మంది అభ్యర్థులను సమన్వయకర్తలుగా అధిష్టానం నియమించింది. వీరిలో కొంతమంది స్థానాలు మార్పు చేసింది. దాదాపుగా 90 మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించడంతో అసంతృప్తి నేతలంతా పార్టీని వీడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్‌లు నిరాకరించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలకు సీఎంవో కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. సీఎంవోకు వెళ్లిన ఎమ్మెల్యేలకు నిరాశ కలిగింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణ, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామిలకు టికెట్ నిరాకరించినట్లు సీఎంవో తెలిపింది. అయితే వీరికి ఎందుకు టికెట్ నిరాకరించారో వైసీపీ అధిష్టానం వివరించింది. సర్వేల రిపోర్ట్ ఆధారంగానే టికెట్ నిరాకరించినట్లు తెలుస్తుంది. మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు స్థానచలనం కలిగింది. కళ్యాణదుర్గం నుంచి ఆమెను పెనుగొండకు మార్చారు.
Also Read: Nara Lokesh : చేనేతల అభ్యున్నతికి బాధ్యత తీసుకుంటానన్న నారా లోకేష్
శంకర్‌నారాయణను అనంతపురం ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రాయదుర్గం నుంచి మెట్టు గోవిందరెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది. ఇప్పటికే ఆయనకు టికెట్ ఖరారు చేసినట్లు సమాచారం. మిగిలిన స్థానాల్లో కొత్త సమన్వయకర్తలను త్వరలో నియమించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలపై పలు సర్వేల రిపోర్టులు, అభ్యర్థుల బలబలాలను అధిష్టానం పరిశీలిస్తుంది. తర్వలోనే ఈ ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను వైసీపీ అధిష్టానం ప్రకటించనుంది. టికెట్ దక్కని నేతల భవిష్యత్ కార్యచరణ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.