Amaravati Latest Updates: అమరావతి కి పాత టెండర్ల స్థానంలో కొత్త టెండర్లు
రాజధాని అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు మరియు భవనాల నిర్మాణానికి సంబంధించిన పాత టెండర్లను ముగించి, కొత్త టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
- By Kode Mohan Sai Published Date - 12:21 PM, Tue - 5 November 24

Amaravati Latest Updates: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు, భవనాల నిర్మాణానికి సంబంధించిన పాత టెండర్లన్నీ ముగించేసి, కొత్తగా టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ అథారిటీ సమ్మతి తెలిపింది. 23 సిఫారసులతో కూడిన సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన అథారిటీ 39వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోబడింది.
రాజధానిలో రహదారుల నిర్మాణం, రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసులు, ఇతర అధికారులు, ఉద్యోగుల నివాస గృహాలు నిర్మాణం, తదితర ప్రభుత్వ నిర్మాణాలు మూడేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
రాజధానిలో భవిష్యత్తులో వరద ముంపు సమస్య తలెత్తకుండా రూపొందించిన ప్రణాళికకు కూడా అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలను పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ విలేకరులకు వెల్లడించారు.
రాజధాని పనులు వేగవంతంగా చేపట్టాలి:
రాజధానిలో 2014-2019 మధ్య వివిధ పనుల కోసం పిలిచిన టెండర్ల గడువు చాలా నెలల క్రితమే ముగిసిపోయిందని, అందువల్ల వాటిని క్లోజ్ చేయకుండా కొత్తగా టెండర్లు ఆహ్వానించడం సాధ్యం కాదని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. వాటిని ముగించడానికి అవసరమైన విధివిధానాలతో చీఫ్ ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించినట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో తదుపరి ప్రక్రియలు వేగంగా చేపడుతామని వెల్లడించారు.
“ఐకానిక్ భవనాలుగా నిర్మించనున్న హైకోర్టు, శాసనసభ భవనాలకు తప్ప మిగతా పనులన్నింటికీ ఈ ఏడాది డిసెంబరు నెలాఖరులోగా టెండర్లు పిలిచే అవకాశం ఉంది. హైకోర్టు, శాసనసభ భవనాల టెండర్లను వచ్చే జనవరి నెలాఖరులోపు పిలుస్తాము.”
మరోవైపు, “గతంలో రూ.41 వేల కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచి, రూ.38 వేల కోట్లతో పనులను అప్పగించాం. అప్పటి గుత్తేదారులకు ₹5 వేల కోట్ల వరకు చెల్లించాం. ఇంకా ₹600 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుత ఎస్‌ఎస్‌ఆర్ ధరల ప్రకారం అంచనా వ్యయం 10-15 శాతం పెరిగింది. గతంలో పనులు చేసిన గుత్తేదారులకు పరిహారం అందించలేదు. వారు రాజధానిలో నిల్వ చేసిన పరికరాలు, వస్తుసామగ్రి అపహరణకు గురైనా, దానికి సీఆర్‌డీఏకి సంబంధం లేదు” అని ఆయన వివరించారు.
రాజధానిలో 3 వెలుపల 3 రిజర్వాయర్ల నిర్మాణం:
రాజధానికి రూ.15 వేల కోట్ల రుణం ఇస్తున్న ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వరద ముంపు నివారణ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాయి. గతంలో నెదర్లాండ్స్ కన్సల్టెన్సీ సంస్థలు రూపొందించిన వరద ముంపు ప్రణాళిక పనులకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. ఆ ప్రణాళికలో భాగంగా కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్‌లను 48.3 కి.మీ. మేర అభివృద్ధి చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.
గత వందేళ్లలో ఆ ప్రాంతంలో జరిగిన వర్షపాతం రికార్డుల ఆధారంగా చూస్తే, అత్యధిక వర్షపాతం జరిగినప్పుడు కూడా ఆ మూడు కాలువలు దాటి నీరు బయటకు రాదని తేలిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా, రాజధానిలో నీరుకొండ వద్ద 0.04 టీఎంసీ, కృష్ణాయపాలెం వద్ద 0.01 టీఎంసీ, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీ సామర్థ్యంతో మూడు రిజర్వాయర్లు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇంకా, ఉండవల్లి వద్ద 7,350 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, రాజధాని వెలుపల లాం నుంచి పెదపరిమి వరకు గ్రావిటీ కెనాల్‌ను వెడల్పు, లోతు పెంచడం, వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెక్కుల సామర్థ్యంతో పంపింగ్ స్టేషన్ నిర్మించడం వంటి ప్రాజెక్టులను చేపట్టాలని చెప్పారు. లాం వద్ద 0.3 టీఎంసీ, పెదపరిమి వద్ద 0.33 టీఎంసీ, వైకుంఠపురం వద్ద 0.17 టీఎంసీ సామర్థ్యంతో మరిన్ని రిజర్వాయర్లు నిర్మించనున్నట్లు తెలిపారు.
ఆ రెండు గ్రామాల్లో భూసమీకరణ ప్రక్రియ:
అమరావతి రైల్వేలైన్‌లో భూములు కోల్పోయిన వడ్డమాను, వైకుంఠపురం గ్రామాల రైతులు సుమారు 1,750 ఎకరాలను భూసమీకరణ విధానంలో తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని మంత్రి పి. నారాయణ చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కూడా సానుకూలత వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. “వీలైనంత మేరకు ఆ భూములను భూసమీకరణలో తీసుకోవాలని ప్రయత్నిస్తాం” అని నారాయణ తెలిపారు.
హోమ్ శాఖకు సంబంధించి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై:
హోం శాఖకు సంబంధించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు నారాయణ స్పందించారు. “అక్కడి పరిస్థితులపై ఆయన స్పందించారు. దానిలో ఎలాంటి వివాదం లేదు. ఏ శాఖలోనైనా పనులు సరిగ్గా జరగకపోతే, ఆ విషయంపై ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రులకు స్పందించే అధికారం ఉంటుంది. వారు స్పందించినప్పుడు, అందరూ అప్రమత్తమవుతారు. న్యాయపరమైన కారణాల వల్ల పోలీసులు చర్యలు తీసుకోవడంలో కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. హోం మంత్రి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారు” అని నారాయణ పేర్కొన్నారు.