World Environment Day : ప్రకృతి మనందరిది..పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: సీఎం చంద్రబాబు
అడవుల సంరక్షణ, జలవనరుల పరిరక్షణ మనందరి కర్తవ్యం. అందుకే ప్రభుత్వం విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. నేడు ఒక్క రోజులోనే ఒక కోటి మొక్కలు నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని స్మరణీయంగా మార్చేందుకు ప్రజలందరూ ముందుకు రావాలి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 11:32 AM, Thu - 5 June 25

World Environment Day : ప్రకృతి ఏ ఒక్కరి సొత్తు కాదు, ఇది సమాజానికే చెందినదని, దానిని కాపాడటంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరమైన సందేశాన్ని పంచుకున్నారు. అడవుల సంరక్షణ, జలవనరుల పరిరక్షణ మనందరి కర్తవ్యం. అందుకే ప్రభుత్వం విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. నేడు ఒక్క రోజులోనే ఒక కోటి మొక్కలు నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని స్మరణీయంగా మార్చేందుకు ప్రజలందరూ ముందుకు రావాలి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Weather : రుతుపవనాలకు అకాల విరామం.. సెగలు కక్కుతున్న సూరీడు.. కారణం ఇదే.!
ఆరోగ్యవంతమైన పరిసరాలున్నప్పుడే ఆరోగ్యవంతమైన జీవితం సాధ్యమవుతుందన్న నమ్మకంతోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్వచ్ఛాంధ్ర’గా ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. చెత్తను ఇంధనంగా మలచే టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తూ, ప్రకృతి సంరక్షణ వైపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ “ప్లాస్టిక్ కాలుష్యం నిర్మూలన” ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం చాలా పెరిగింది. ఇది మన ఆరోగ్యానికే కాదు, భూమికి కూడా ముప్పు. అందుకే ప్రతి ఒక్కరూ తమ వంతుగా బాధ్యత తీసుకుని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలి అని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఒక వ్యక్తిగత సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు, ప్రకృతి రక్షణే భవిష్యత్ రక్షణ అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన వనమహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మొక్కలు నాటి ఈ ఉద్యమానికి నాంది పలికే కార్యక్రమంగా ఇది మారనుంది. పర్యావరణ పరిరక్షణపై సీఎం తీసుకుంటున్న చర్యలు నేటి తరానికి మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా ప్రయోజనం కలిగేలా ఉంటాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. మొక్కల నాటకం, ప్లాస్టిక్ రహిత జీవితం, మరియు సురక్షిత వాతావరణం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాలు సమాజంలోని ప్రతివ్యక్తిలో చైతన్యం రేకెత్తించేలా ఉన్నాయి.