Nara Lokesh : ఆ సర్వేతో 100 మంది ఔట్?లోకేష్ మార్క్ షురూ!
తెలుగుదేశం పార్టీని తనదైన శైలిలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గాడిలో పెడుతున్నాడు. అందుకోసం సర్వేలను ఎప్పటికప్పుడు చినబాబు టీం చేస్తోంది. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా గతానికి భిన్నంగా ఈసారి టీడీపీ నిర్ణయాలను తీసుకుంటోంది
- By CS Rao Published Date - 01:56 PM, Thu - 23 December 21

తెలుగుదేశం పార్టీని తనదైన శైలిలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గాడిలో పెడుతున్నాడు. అందుకోసం సర్వేలను ఎప్పటికప్పుడు చినబాబు టీం చేస్తోంది. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా గతానికి భిన్నంగా ఈసారి టీడీపీ నిర్ణయాలను తీసుకుంటోంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కో ఆర్డినేటర్ గా కేశినేని నానికి అప్పగించడమే. రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శగా చిరుమామిళ్ల మధుబాబుకు అవకాశం ఇవ్వడం కూడా సరికొత్త ప్రక్షాళనకు సంకేతం. అంతేకాదు, మాచర్ల నియోజకవర్గ ఇంచార్జిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి, విశాఖ సౌత్ ఇంచార్జిగా గండి బాబ్జిని నియమించడాన్ని గమనిస్తే రాజీలేని మార్పులు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నాయని భావించొచ్చు.
Also Read: Theatres in AP : ఏపీ ధియేటర్లలో ఇంత అరాచకమా?
ఎంపీ కేశినేని నాని వ్యాపారాలను ప్రత్యర్థులు దెబ్బ తీశారు. ఆయన్ను తమవైపు ఆకర్షించేందుకు వైసీపీ సామదానదండోపాయాలను ప్రయోగించింది. అయినప్పటికీ అటు వైపు చూడకుండా టీడీపీలోని అంతర్గత అగాధాలను పూడ్చుకోవాలని సూచనలు ఇచ్చాడు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తనదైన టీడీపీ వాదాన్ని నిలబెట్టాడు. అందుకే, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా నియమించిన కమిటీలను పక్కన పెట్టేలా కేశినేనికి స్వేచ్ఛను అధిష్టానం ఇచ్చింది. ఆ మేరకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు.ఇలాంటి కఠిన నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తీసుకోబోతున్నాడు. కోవర్టులను ఏరిపారేసి కార్యక్రమం ప్రారంభం అయింది. తొలుత నెల్లూరు కార్పొరేషన్ లోని ఇద్దరు కార్పొరేటర్లపై వేటు వేశాడు. తాజాగా నియోజకవర్గాల వారీగా నియామకాలకు పగడ్బందీ వ్యూహాన్ని చంద్రబాబు రచించాడు. సామాజిక ఈక్వేషన్స్ లాంటి మూస పద్దతిని తాత్కాలికంగా దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది.
Also Read: Sr NTR : 24 ఇడ్లీ, 40 బజ్జీలు, 2 లీటర్లపాలు.. జయహో ఎన్టీఆర్
తెలుగుదేశం పార్గీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చే ఆనవాయితీని చంద్రబాబు కొనసాగించాడు. ఆ క్రమంలో బలమైన లీడర్లను పక్కన పెట్టి ఇతరులను నియమించిన దాఖలాలు అనేకం. ఫలితంగా తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. అందుకే, ఇప్పుడు సామాజిక సమీకణాలకు భిన్నంగా ప్రజాదరణ ఉండే లీడర్ల కోసం జల్లెడ పడుతున్నాడు. గెలిచిన తరువాత ఇతర పార్టీల వైపు చూడకుండా ఉండే కరుడుకట్టిన టీడీపీ వాదులను వెదుకుతున్నాడు. ప్రాణ, ఆస్థి నష్టం జరిగినప్పటికీ టీడీపీ జెండాను వీడకుండా ఉండే నాయకత్వంపై దృష్టి పెట్టాడు. ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లను కాకుండా పార్టీ కోసం త్యాగం చేసిన యూత్ ను ఎంపిక చేయడానికి కసరత్తు జరుగుతోంది.ఇప్పుడున్న నియోజకవర్గ ఇంచార్జిల్లో దాదాపు 100 మందికి పైగా రోబోయే రోజుల్లో మారబోతున్నారని టాక్. అధికారం పోయిన తరువాత సాహసోపేతంగా పోరాడిన చింతమనేని, పయ్యావులు, ధూళ్లిపాళ్ల, నిమ్మల రామానాయుడు, అచ్చెంనాయుడు, బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ల ను నియోజకవర్గ ఇంచార్జిలుగా నియమించాలని అధ్యయనం జరుగుతోంది. ఆ మేరకు అన్నికోణాలను నుంచి లోకేష్ టీం ఎప్పటికప్పుడు సర్వే చేస్తోంది. దాని ప్రకారం ఈసారి కనీసం 50శాతం మంది యువతకు టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తున్నారట. లోకేష్ టీంలోని వాళ్లను ఎన్నికల రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధమవుతోందని వినికిడి.
Also Read: Amaravathi : అమరావతికి అదీ పాయే.!
తాజా సర్వే ప్రకారం 120 స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ అనూహ్య ఫలితాలను సాధించబోతుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. అందుకే, ఎంపీ అభ్యర్థిత్వాల కోసం చంద్రబాబు ఇంటి వద్దకు ఇప్పటి ఉంచే చాలా మంది క్యూ కడుతున్నారని తెలుస్తోంది. పార్టీలోని సీనియర్లకు ఎంపీ అభ్యర్థిత్వాలను అప్పగించాలని భావిస్తున్నారట. యువతను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నికల రంగంలోకి దింపాలని అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. మొత్తం మీద ఈసారి కుల, మత, ప్రాంతాల సమీకరణాలు కాకుండా తాడోపేడో తేల్చుకునే `ఎల్లో` సైన్యాధిపతులను ఎన్నికల యుద్ధానికి దింపాలని లోకేష్ అండ్ టీం చేసిన సర్వే తేల్చేసిందట. మరి, చంద్రబాబు గతంలో మాదిరిగా చివరి నిమిషంలో మూస పద్దతిని అనుసరిస్తాడా? లేక లోకేష్ మార్క్ ఎంపిక ఉంటుందా? అనేది చూడాలి.