Nara Lokesh: సరైనోడు.. లోకేష్..! ‘ఒక్క ఛాన్స్’పై సెటైర్!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆలోచింప చేసేలా నూతన ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేయడం అందర్నీ ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రజలుకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెబుతూ సందేశాన్ని కూడా ఇవ్వడం ఆయన రాజకీయ పరిణితిని సూచిస్తోంది.
- By CS Rao Published Date - 02:39 PM, Sat - 1 January 22

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆలోచింప చేసేలా నూతన ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేయడం అందర్నీ ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రజలుకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెబుతూ సందేశాన్ని కూడా ఇవ్వడం ఆయన రాజకీయ పరిణితిని సూచిస్తోంది. పాజిటివ్ యాంగిల్లో సీఎం జగన్ ను న్యూ ఇయర్ రోజున ఎత్తిపొడిచాడు. `ఇంకో ఛాన్స్` ఇవ్వకుండా మార్పును ఆహ్వానించాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి వేదికపైన `ఒక్క ఛాన్స్` అంటూ వేడుకున్నాడు. పాదయాత్రకు వెళ్లిన ఆయన ప్రజా సమస్యలను తెలుసుకున్నాడు. అన్ని సమస్యలను పరిష్కారిస్తానని హామీ ఇచ్చాడు. నవరత్నాలను మేనిఫెస్టోలో పెట్టాడు. వాటిని ప్రజల మధ్యకు తీసుకెళ్లాడు. ఆ సందర్భంగా `ఒక్క ఛాన్స్` అంటూ అభ్యర్థించాడు. ఆ అభ్యర్థన సానుభూతి రూపాన్ని సంతరించుకుంది. ఫలితంగా 2019 ఎన్నికల్లో అప్రతిహతంగా జగన్ గెలిచాడు. `ఒక్క ఛాన్స్` నినాదం జగన్ ను సీఎం చేసిందని టీడీపీ బలంగా నమ్ముతుంది. అందుకే, ఆ నినాదంపై లోకేష్ వ్యంగ్యంగా నూతన సంవత్సర గ్రీటింగ్స్ చెప్పడం విశేషం.
ఇటీవల లోకేష్ దూకుడు పార్టీలో పెరిగింది. జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పోరాటాలు చేస్తున్నాడు. కార్యకర్తలకు ఏ మాత్రం అన్యాయం జరిగినా వెంటనే స్పందిస్తున్నాడు. వాళ్ల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తున్నాడు. మనోధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. అంతేకాదు, ఆయన తల్లి భువనేశ్వరి మీద అసెంబ్లీ వేదికగా వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించాడు. ప్రతికారం భవిష్యత్ లో ఎలా ఉంటుందో ఆయన మాటల ద్వారా ఆవిష్కరించాడు. సహజంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుది కక్ష సాధింపు మనస్తత్వం కాదు. ప్రత్యర్థులపై కూడా ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడాలనే నైజం. అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యర్థులకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంటాడు. కానీ, ఇప్పుడు ఆ తరహాలో జగన్మోహన్ రెడ్డి టీడీపీ క్యాడర్‌కు గానీ, చంద్రబాబు ఫ్యామిలీకిగానీ ఇవ్వడంలేదు. అందుకే, ఇప్పుడు లోకేష్ స్పందించాడు. చంద్రబాబు మౌనంగా ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చిన తరువాత కక్ష తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నాడు.
అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే ప్రజల్ని లోకేష్ అప్రమత్తం చేస్తున్నాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రజలు ఆలోచించుకోవాలని సూచిస్తున్నాడు. ఇంకో ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో..తెలుసుకోవాలని అప్రమత్తం చేస్తున్నాడు. `గడచిన కాలంలో మన ఆలోచనలు, నమ్మకాలలో కొన్ని మనల్ని తప్పుదారి పట్టించి ఉండవచ్చు. మన బలహీనతల వల్ల మోసపోయి ఉండవచ్చు. అలాగని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతూ ఉండాలి. చేసిన తప్పుకు మళ్లీ `ఇంకో ఛాన్స్` ఇవ్వకుండా మార్పును ఆహ్వానించాలి’ అని లోకేశ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లోకేష్ లోని రాజకీయ పరిణితిని సూచిస్తోందని తమ్ముళ్లు సంబరపడుతున్నారు.