Nara Bhuvaneswari : అమరావతే ఏపీ రాజధాని.. నిజం గెలవాలి పర్యటనలో నారా భువనేశ్వరి వ్యాఖ్య
మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని నారా భువనేశ్వరి అన్నారు. మహిళలు తమ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా
- By Prasad Published Date - 08:27 AM, Fri - 9 February 24

మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని నారా భువనేశ్వరి అన్నారు. మహిళలు తమ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దని సూచించారు. రాజధాని గ్రామం వెంకటపాలెంలో మహిళా పాడిరైతులతో భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మహిళలను వంటింటి నుండి సమాజంలోకి తీసుకొచ్చి ప్రోత్సహించింది ఎన్టీఆర్ అని తెలిపారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు ఇచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని.. ఎన్టీఆర్ తర్వాత నారా చంద్రబాబునాయుడు కూడా మహిళలను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చారని.. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలను ప్రోత్సహించి ముందుకు నడిపారన్నారు. 1994లో హెరిటేజ్ సంస్థ ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను చంద్రబాబు తనకు అప్పగించారని… కంపెనీ నిర్వహణ బాధ్యతలు ఇస్తే నా వల్ల ఏం అవుతుంది? అన్నప్పుడు…నువ్వు చేయగలవు….నువ్వు ముందుకు నడిపించగలవని చంద్రబాబు తనతో అన్నారని తెలిపారు. ఆ మాటలను నేను ఎప్పుడూ మర్చిపోలేను. కేవలం డిగ్రీ చదివి గృహిణిగా ఉన్న నాపై చంద్రబాబు అంత నమ్మకం చూపారని.. మహిళా శక్తిపై చంద్రబాబుకు అపారమైన నమ్మకం ఉందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
1994లో హెరిటేజ్ సంస్థలో కేవలం 400మంది పాడిరైతులు ఉండేవారు. నేడు 11రాష్ట్రాల్లో హెరిటేజ్ కంపెనీ ఉందన్నారు. 10చేతులు కలిస్తే ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి హెరిటేజ్ కంపెనీ నిదర్శనమన్నారు. 3 లక్షల మంది రైతులు, సిబ్బంది ఓ టీమ్ గా పనిచేయడం వల్ల కంపెనీ ముందుకు వెళుతుందని.. పాడిపంటలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయన్నారు. 1500రోజులుగా అమరావతి రైతులు, మహిళలు నిర్విరామంగా చేస్తున్న పోరాటాలు వృథా కావని నారా భువనేశ్వరి తెలిపారు. అమరావతి రైతుల పోరాటానికి, ఉద్యమ స్ఫూర్తికి పాదాభివందనం చేశారు. అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తెలుగుదేశమేనన్నారు. అమరావతిలో రాజధానిని నిర్మించేది చంద్రబాబేనని… చంద్రబాబు ఒక్కడిని నమ్మి అమరావతి రైతులు 33వేల ఎకరాలను ఇచ్చారన్నారు. చంద్రబాబుపై అమరావతి రైతులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదని.. చంద్రబాబు చెప్పారంటే…చేసి తీరుతారని భువనేశ్వరి భరోసా ఇచ్చారు.