DSP Notification : డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటోందన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామన్నారు.
- By Latha Suma Published Date - 06:16 PM, Fri - 31 January 25

DSP Notification : మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటోందన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, నవ్యాంధ్రలోనూ 80 శాతంపైగా టీచర్ల నియామకం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని నిరూపిస్తున్నామని.. అందులో భాగస్వామ్యులైన వారందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటూ ప్రజాస్వామ్య విలువలు చాటుతున్నామని మంత్రి వెల్లడించారు. టీచర్ల బదిలీ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నామన్నారు. ప్రతీ శుక్రవారం కమిషనర్ ఉపాధ్యాయులకు వారి సమస్యలపై అందుబాటులో ఉంటున్నారని.. తాను కలుస్తున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థలో విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలను వైసీపీ ప్రభుత్వం గందరగోళం చేసిందని వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థుల సంఖ్య ఖచ్చితత్వాన్ని తెలుసుకునేందుకు ఆపార్ కార్డ్ విధానం తెస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ ఔట్స్ నివారణకు ప్రత్యేక వ్యవస్థ తీసుకొస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. జగన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు 3 వేలు కోట్లు పెట్టి దిగిపోయారని విమర్శించారు. మేము మా విడతగా రూ.800 కోట్లు చెల్లింపులు చేశాం. జగన్ పెట్టిన జగన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వైసీపీ నేతలు ఆందోళనలు చేయటం విడ్డూరంగా ఉంది అని మండిపడ్డారు. జగన్ రైతులకు పెట్టిన ధాన్యం బకాయిలు, పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిలు అన్నీ తామే తీరుస్తున్నామన్నారు. అలాగే జగన్ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తీర్చేది కూడా తామే అని స్పష్టం చేశారు.