CBI Court : విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
బెయిల్ నిబంధనల ప్రకారం కోర్టు అనుమతితోనే విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్, నార్వే తదితర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
- By Latha Suma Published Date - 05:26 PM, Fri - 31 January 25

CBI Court : వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చే నెల 10 నుంచి మార్చి 10 మధ్యలో ఓ పది హేను రోజులు విదేశాలకు వెళ్లేందకు సీబీఐ కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఇటీవల వైసీపీ పార్టీకీ, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి.. ఇక నుంచి పూర్తిగా రాజకీయాలకు దూరమౌతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక వ్యవసాయం చేసుకుంటానని ఆయన ప్రకటించారు. అన్నట్లుగా ఫామ్ హౌజ్ లో దిగిన ఫొటోలను ఇటీవల తన X ఖాతాలో విజయసాయిరెడ్డి షేర్ చేశారు.
కాగా, వైఎస్ జగన్ కు సంబంధించిన పలు సీబీఐ కేసుల్లో విజయసాయిరెడ్డి ఏ2గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుల్లో జగన్ తో పాటు ఆయన కూడా జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. ఇందుకు సంబంధించిన విచారణ ఇప్పుడు జరుగుతోంది. బెయిల్ నిబంధనల ప్రకారం కోర్టు అనుమతితోనే విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్, నార్వే తదితర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన న్యాయస్థానం విజయసాయిరెడ్డి 15 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
ప్రస్తుతం విజయసాయిరెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల్లోనే కోర్టు అనుమతి ఇచ్చింది. విజయసాయిరెడ్డిపై కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి సీఐడీ, ఈడీ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ కేసు విషయలో సీఐడీ ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఆయన ఈడీ విచారణకు కూడా ఓ సారి హాజరయ్యారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారని తెలిసి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ లుకౌట్ నోటీసులు ఇంకా కొనసాగుతున్నాయి.
Read Also: Virat Kohli Clean Bowled: రంజీ ట్రోఫీలోను అదే ఆట.. మరోసారి నిరాశపర్చిన కోహ్లీ