Srisailam Temple Issue: శ్రీశైలం హింసాత్మక ఘటన.. రంగంలోకి దిగిన కన్నడ పోలీసులు..!
- By hashtagu Published Date - 02:13 PM, Sat - 2 April 22

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఇటీవల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీశైలం పురవీధుల్లో వీరంగం చేసిన కన్నడ యువకులు, ఓ సత్రం ముందు ఉన్న టీ దుకాణం వద్ద కన్నడ భక్తులకు, స్థానిక భక్తులకు మధ్య ప్రారంభమైన గొడవ, హింసాత్మక ఘర్షణలకు దారి తీసిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో శ్రీశైలంలో యాత్రికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు శనివారం కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం 14 మంది పోలీసులు, ఇద్దరు పీఎస్‌ఐలు, ఇద్దరు ఏఎస్‌ఐలు, 10 మంది కానిస్టేబుళ్ల బృందాన్ని పంపించింది. దీంతో ఈరోజు కర్నాటక పోలీసులు శ్రీశైలం చేరుకుని, అక్కడ శ్రీశైలం పురవీధుల్లో జరిగిన హింసాత్మక ఘటన పై విచారణ చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు.
ఇక ఆతర్వాత కన్నడ పోలీసుల బృందం ఆదివారం కర్నాటకకు చేరుకుని గత నెల మార్చి 30 న జరిగిన హింసాత్మక ఘటన పై వివరణాత్మక నివేదికను కర్నాటక ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇకపోతే శ్రీశైలంలో కన్నడ భక్తుడికి, అక్కడి స్థానిక దుకాణ యజమాని మధ్య మొదలైన చిన్న గొడవ, ఆ తర్వాత హింసాత్మక ఘర్షనకు దారి తీయగా, ఆ ఘటనలో కర్నాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
బాగల్‌కోట్ జిల్లా జానమట్టి గ్రామానికి చెందిన శ్రీశైల వరిమఠం తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం బెంగుళూరుకు తరలించగా, గాయపడిన మరో వ్యక్తి గోపాల్‌ను అంబులెన్స్‌లో కర్నాటకలోని తన స్వగ్రామానికి పంపించారు. ఉగాది పండుగ సందర్భంగా కర్నాటక రాష్ట్రం నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఉగాది రోజును జరిగే మతపరమైన ఉత్సవాల అనంతరం తిరిగి ఇంటికి చేరుకుంటారు.