బాలయ్యకు గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు..
- Author : Vamsi Chowdary Korata
Date : 20-02-2026 - 12:46 IST
Published By : Hashtagu Telugu Desk
Hindupur ఏపీ ప్రభుత్వం హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా హిందూపురం రోడ్లు, భవనాలశాఖ పరిధిలో డివిజన్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. బాలయ్య హిందూపురంలో ఉన్న సమయంలోనే ఈ ఉత్తర్వులు ఇచ్చారు. కొత్త హిందూపురం డివిజన్‌లోకి పెనుకొండ, మడకశిర సబ్‌డివిజన్లు కలిశాయి. మొత్తానికి హిందూపుర కొత్త ఆర్ అండ్ బీ డివిజన్ ఏర్పాటైంది.
- హిందూపురానికి ప్రభుత్వం తీపికబురు
- కొత్తగా ఆర్ అండ్ బీ డివిజన్ ఏర్పాటు
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గానికి ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఆర్ అండ్ బీలో కొత్తగా హిందూపురం డివిజన్ ఏర్పాటు చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో కొత్తగా హిందూపురం రోడ్లు, భవనాలశాఖ పరిధిలో డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ధర్మవరం డివిజన్‌లో 2,486.08 కి.మీ.మేర ధర్మవరంతో పాటుగాకదిరి, పెనుకొండ, మడకశిర సబ్‌డివిజన్లు ఉన్నాయి. తాజా మార్పులతో పరిస్థితి మారిపోయింది. ఇకపై ధర్మవరం ఆర్ అండ్ బీ డివిజన్‌లోకి ధర్మవరం, కదిరి సబ్ డివిజన్లు మాత్రమే వస్తాయి.
అయితే కొత్తగా ఏర్పాటు చేసిన హిందూపురం ఆర్ అండ్ బీ డివిజన్ లోకి 1,336.22 కి.మీ పెనుకొండ, మడకశిర సబ్‌డివిజన్లు కలిపి వస్తాయి. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం డివిజన్‌ను తొలగించారు.. అనంతపురం డివిజన్‌కు కలిపారు. ఈ మార్పులకు తగిన విధంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటైన హిందూపురం డివిజన్‌కు కళ్యాణదుర్గం డివిజన్ ఈఈ పోస్టు, అక్కడి 24 మంది సిబ్బంది పోస్టులను మార్చారు. మొత్తం మీద హిందూపురం ఆర్ అండ్ బీ డివిజన్ ఏర్పాటైంది. నందమూరి బాలయ్య ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.. ఆ సమయంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ డివిజన్ మార్పుపై గతంలో ప్రతిపాదనలు రాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఉత్తర్వులు వచ్చేశాయి.
బాలయ్య హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. హిందూపురంలో రూ.8కోట్లతో నిర్మించే పట్టుగూళ్ల మార్కెట్‌కు బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. సీఎస్‌బీ, రాష్ట్ర ప్రభుత్వం దీనిని మంజూరు చేశాయి. ఏపీ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని.. రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా మారుస్తుందన్నారు బాలయ్య. పట్టు రైతులకు, రీలర్లకు ప్రోత్సాహక నిధులు పెండింగ్ ఉన్నాయని.. ఆ రూ.80 కోట్లు త్వరగా మంజూరు చేసేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానన్నారు. హిందూపురంలో పట్టుగూళ్ల పరిశోధనా సంస్థ, అతిపెద్ద మార్కెట్ నిర్మించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. బాలయ్య ముద్దిరెడ్డిపల్లి, వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌లను ప్రారంభించారు. ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటూ బాలయ్య ప్రశంసించారు.