Kakani : బెంజ్‌సర్కిల్‌ను “కాకాని” సర్కిల్‌గా మర్చండి – జిల్లా కలెక్టర్‌కు కాకాని ఆశయ సాధన సమితి వినతి
ఆంధ్రప్రదేశ్ ఉక్కు మనిషిగా పేరొందిన కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని పునఃస్థాపన చేయాలని కోరుతూ కాకాని ఆశయ సాధన
- By Prasad Published Date - 07:53 AM, Tue - 11 July 23

ఆంధ్రప్రదేశ్ ఉక్కు మనిషిగా పేరొందిన కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని పునఃస్థాపన చేయాలని కోరుతూ కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు, కాకాని వెంకటరత్నం మనవడు కాకాని తరుణ్ కుమార్.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావుకు వినతిపత్రం సమర్పించారు. విజయవాడ బెంజిసర్కిల్‌కు కాకాని సర్కిల్‌గా పేరు మార్చాలని లేఖలో ప్రస్తావించారు. సోమవారం విజయవాడలోని కలెక్టరేట్‌లోని స్పందన కార్యక్రమంలో కాకాని ఆశయ సాధన సమితి కార్యదర్శి గుమ్మడి రామకృష్ణ, సర్వోదయ స్వాతంత్య్ర సమరయోధుల సంఘం కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావుతో కలిసి కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాకాని తరుణ్‌కుమార్ మాట్లాడుతూ .. బెంజిసర్కిల్‌లో విగ్రహ ప్రతిష్ఠాపనకు అయ్యే ఖర్చును కేఏఎస్‌ఎస్ భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం విగ్రహాన్ని తొలగించే సమయంలోనే బెంజిసర్కిల్‌లో విగ్రహాన్ని పునరుద్ధరిస్తామని జిల్లా యంత్రాంగం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాకాని వెంకటరత్నం మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించారన్నారు. ఆగస్ట్ 3న జరగనున్న కాకాని వెంకటరత్నం 123వ జయంతి దృష్ట్యా జిల్లా యంత్రాంగం బెంజ్ సర్కిల్‌కు కాకాని సర్కిల్‌గా నామకరణం చేసి విగ్రహాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని తరుణ్‌కుమార్ కోరారు. గతంలో కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా కలెక్టర్లకు లేఖలు అందించారని తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 8న కలెక్టర్ డాక్టర్ ఎస్ డిల్లీరావు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, కాకాని కుటుంబసభ్యులతో కలిసి బెంజ్ సర్కిల్ వద్ద స్థలాన్ని సందర్శించారని గుర్తు చేశారు. అలాగే విగ్రహ ప్రతిష్ఠాపన కోసం విజయవాడ మున్సిపల్ కమీషనర్ సంయుక్తంగా సర్వే నిర్వహించినట్లు తెలిపారు. దివంగత మంత్రి కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని పునరుద్ధరించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కాకాని ఆశయ సాధన సమితి కలెక్టర్‌ను కోరారు. బెంజిసర్కిల్‌కు కాకాని సర్కిల్‌గా నామకరణం చేయడంపై సంబంధిత అధికారులతో చర్చించి బెంజి సర్కిల్‌లో కాకాని విగ్రహాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డిల్లీరావు వారికి హామీ ఇచ్చారు.