Adani issue : అబద్ధాలను అందంగా అల్లటంలో జగన్‌కు ఆస్కార్ ఇవ్వాలి: వైఎస్ షర్మిల
అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా..? అని ప్రశ్నలతో మండిపడ్డారు.
- By Latha Suma Published Date - 02:02 PM, Fri - 29 November 24

YS Sharmila : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పై వైఎస్ షర్మిల మరోసారి విమర్శులు గుప్పించారు. అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. శాలువలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2021, మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రూ.2.14 పైసలు ఉంటే, తమరు రూ 2.49 పైసలకు కొన్నందుకు శాలువలు కప్పాలా ? అని నిలదీశారు. అదానీ వద్ద గుజరాత్ యూనిట్ ధర రూ 1.99 పైసలకే కొందని.. అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి రూ.2.49 పైసలకు కొన్నందుకు సన్మానాలు చేయాలా..? అంటూ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా..? అని ప్రశ్నలతో మండిపడ్డారు.
ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా..? అని అడిగారు. దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్‌మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే .. గుజరాత్‌కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదు..? వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రూ.2.49 రేటుకు ఎందుకు ఒప్పుకున్నారు..? అని నిలదీశారు. ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్రగా మిగిలిపోతుందని అన్నారు. అదానీతో ఒప్పందం కుదుర్చుకోవడం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర అంటూ కౌంటర్ ఇచ్చారు. రూ.1750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం కూడా చరిత్రేనంటూ షర్మిల విమర్శించారు.
గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఎల్ చేసుకుని రూ.35 వేల కోట్ల భారం వేసిందని జగన్ చెబుతున్నాని.. మరీ అధికారంలోకి వచ్చాక గాడిదలు కాశారా..? అంటూ ఫైర్ అయ్యారు. టెండర్లు రద్దుతో ఎందుకు సరిపెట్టారు..? అని నిలదీశారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్‌లో తన పేరు లేదని జగన్ బుకాయిస్తున్నారని.. ఆనాడు ఏపీ సీఎం మీరు కదా..? అని షర్మిల అడిగారు. మీరు అవినీతికి పాల్పడ్డారని అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు FBI, SEC స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయని.. సోలార్ పవర్ ఒప్పందాల్లో రూ.1750 కోట్లు ఏపీ సీఎంకు ఇచ్చారని స్పష్టం చేశాయన్నారు.
Read Also: Maharashtra : రెండు రోజుల్లో కొత్త సీఎం పై ప్రకటన : ఏక్‌నాథ్ షిండే