Jagan and Naidu: ఆహా! బాబు, జగన్ ఫిక్సింగ్!
రాజకీయంగా బద్ధశత్రువులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు. వాళ్లిద్దరూ ఒకే వేదికపై కనిపించే దృశ్యాన్ని ఈనెల 6వ తేదీన చూడబోతున్నాం.
- Author : CS Rao
Date : 03-08-2022 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
రాజకీయంగా బద్ధశత్రువులు జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు. వాళ్లిద్దరూ ఒకే వేదికపై కనిపించే దృశ్యాన్ని ఈనెల 6వ తేదీన చూడబోతున్నాం. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా సీఎం, ప్రతిపక్షనేత ఇద్దరూ ఒకే సమావేశానికి హాజరవుతున్నారు. వాళ్లిద్దర్నీ కలిపే ప్రాంతం రాష్ట్రపతిభవన్ కావడం విశేషం. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం నిర్వహించబోవడం మరో విచిత్రం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఆ క్రమంలో ఆగస్టు 6వ తేదీ జరుగునున్న ఉత్సవాల జాతీయ కమిటీ సమావేశానికి వైఎస్ జగన్, చంద్రబాబులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగే ఆ సమావేశానికి వాళ్లిద్దరూ హాజరు కానున్నారు. దేశంలోని అన్ని పార్టీల అధినేతలను కేంద్రం ఆహ్వానించింది. ఆ నేపథ్యంలో ఏపీ నుంచి జగన్, బాబుకు ఆహ్వానం అందడం గమనార్హం.
Also Read: Zawahari & US Attack: అల్ ఖైదా ఉగ్రవాది అల్ జవహరిని అమెరికా ఎలా మట్టుబెట్టిందో తెలుసా?
అధికార ప్రతిపక్ష పార్టీ అధినేతలిద్దరూ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సమావేశానికి హాజరు కావడమే కాకుండా అనంతరం ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అవుతారని సమాచారం. రాష్ట్రానికి సంబంధించి వివిధ పెండింగ్ సమస్యల పరిష్కారానికి కేంద్ర హోం మంత్రి అమిత్షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతోనూ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అదేరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఆ క్రమంలో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ను కూడా జగన్ కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన ఆహ్వానం మేరకు చంద్రబాబు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్ణయించారు. 2018 నుంచి బీజేపీతో తెగదెంపులైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరుకావడాన్ని చంద్రబాబు ఒక అవకాశంగా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి పార్లమెంటు వేదికగా వివిధ సందర్భాల్లో టీడీపీ కూడా బీజేపీకి మద్దతిస్తూ వచ్చింది. కేంద్రంతో వైసీపీ ప్రభుత్వం అంటకాగుతూ టీడీపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే అభిప్రాయం చంద్రబాబులో ఉంది. ఆ నేపథ్యంలో బీజేపీతో మళ్లీ దగ్గరవ్వడానికి బాబు ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. మొత్తం మీద ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత తొలిసారిగా కలిసి పాల్గొన్నబోతున్న సమావేశం కాబట్టి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: US kills Al Qaeda leader: అమెరికా డ్రోన్ దాడి.. ఆల్ ఖైదా ముఖ్య నాయకుడు హతం