Inter Student Dead: ఏపీలో విషాదం.. పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి
బద్వేల్ సమీపంలోని రామాంజనేయనగర్‌కు చెందిన ఓ బాలిక స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో విఘ్నేష్ (20) అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేశాడు.
- Author : Gopichand
Date : 20-10-2024 - 10:27 IST
Published By : Hashtagu Telugu Desk
Inter Student Dead: కడప జిల్లాలోని బద్వేల్‌లో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని (Inter Student Dead) మృతి చెందింది. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. శనివారం విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ఈ ఘటనకు కారణం ప్రేమ వ్యవహారమే అని ఎక్కువగా వినిపిస్తున్న మాట.
అసలేం జరిగిందంటే..?
బద్వేల్ సమీపంలోని రామాంజనేయనగర్‌కు చెందిన ఓ బాలిక స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో విఘ్నేష్ (20) అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేశాడు. శనివారం బాలికను సెంచరీ ఫ్లైఉడ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి మాట్లాడదామని పిలిపించి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. హైవేపై తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతేకాకుండ కడప రిమ్స్‌కు తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బద్వేల్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా మొదలు పెట్టారు.
Also Read: ICAI CA Result 2024: సీఏ ఫౌండేషన్, ఇంటర్ ఫలితాలు ఎప్పుడు అంటే..?
ప్రేమ పేరుతో తమ కుమార్తెను విఘ్నేష్ వేధిస్తున్నాడని, 8వ తరగతి నుంచే విఘ్నేష్ వేధించేవాడని అతనికి వివాహమైనా తమ కుమార్తె వెంట పడేవాడని బాలిక తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై ఎస్పీ స్పందిస్తూ.. బాధిత విద్యార్థినికి 80 శాతం గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమెను కడప రిమ్స్‌లో చేర్పించి చికిత్స కొనసాగిస్తున్నామని తెలిపారు. చిన్నప్పటి నుంచే ఇద్దరికీ పరిచయం ఉందని, ఇద్దరూ ఒక ప్రాంతానికి చెందిన వారేనని ఎస్పీ వివరించారు. తనను కలవాలని విద్యార్థినికి విఘ్నేష్ ఫోన్ చేశాడని, కలవకపోతే చనిపోతానని బెదిరించాడని అన్నారు.
ఇద్దరూ పీపీకుంట చెక్‌పోస్ట్ సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లాక విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి విఘ్నేష్ పరారయ్యాడని అన్నారు. నిందితుడి ఆచూకీ కోసం 4 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ హర్షవర్ధన్ వివరించారు. అయితే శనివారం రాత్రి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు బాలిక ఆదివాం ఉదయం మృతిచెందింది. సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బాలిక కుటుంబానికి న్యాయం జరగాలని అధికారులను ఆదేశించారు.