Basavatarakam : రేపే అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన
తుళ్లూరు - అనంతవరం గ్రామాల మధ్య ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్‌కు రేపు ఉదయం 9.30 గంటలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు మరియు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు.
- By Latha Suma Published Date - 04:58 PM, Tue - 12 August 25

Basavatarakam : అమరావతిలో ఆరోగ్య రంగానికి కొత్త దిక్సూచి అవతరించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నూతన శకానికి నాంది పలుకుతూ, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తన విస్తరణలో భాగంగా అమరావతిలో కొత్త కేంద్రాన్ని స్థాపించబోతుంది. తుళ్లూరు – అనంతవరం గ్రామాల మధ్య ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్‌కు రేపు ఉదయం 9.30 గంటలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు మరియు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు. ఈ శంకుస్థాపనతో ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభంకానుంది. ఆసుపత్రి స్థలంగా 21 ఎకరాల భూమిని అమరావతి ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) కేటాయించిన విషయం తెలిసిందే.
ప్రారంభ దశలో ఈ ఆసుపత్రిని 300 పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు. భవిష్యత్తులో దీన్ని 1000 పడకల వరకు విస్తరించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అధునాతన యంత్రాలు, నిపుణులైన వైద్య బృందం, మెరుగైన సదుపాయాలతో దేశంలోనే అత్యుత్తమ క్యాన్సర్ చికిత్స కేంద్రాల్లో ఇది ఒకటిగా మారనుంది. వాస్తవానికి అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళికలు అప్పుడే 2014 నుంచి 2019 మధ్య కాలంలోనే రూపుదిద్దుకున్నాయి. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆసుపత్రికి భూమిని కేటాయించి, ముందడుగు వేసింది. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన ప్రగతికి బ్రేక్ పడింది.
అయితే తాజా పరిణామాలతో మరోసారి ఆసుపత్రికి స్థలం కేటాయించడంతో, ఈసారి నిర్దేశిత కాల వ్యవధిలో నిర్మాణాన్ని పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో బసవతారకం ట్రస్ట్ ముందుకు వెళ్తోంది. రోగులకు త్వరితగతిన, అధునాతన సాంకేతికతతో సేవలందించాలన్న లక్ష్యంతో ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయనున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణంతో అమరావతిలో వైద్య సేవలు మరింతగా మెరుగవుతాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా, పొరుగున ఉన్న రాష్ట్రాల రోగులకూ ఇది అత్యవసర సమయంలో కీలక కేంద్రంగా నిలవనుంది. క్యాన్సర్ చికిత్సలో నిపుణులైన బసవతారకం సంస్థ ద్వారా మరోసారి ఆరోగ్యరంగంలో ఓ గొప్ప ఆవిష్కరణకు శ్రీకారం చుట్టనుంది.