Union Cabinet : ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
ఈ నాలుగు యూనిట్లను ఏపీ, ఒడిశా, పంజాబ్‌లో ఏర్పాటు చేయనుండగా, మొత్తం రూ.4,594 కోట్ల పెట్టుబడితో వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
- By Latha Suma Published Date - 04:37 PM, Tue - 12 August 25

Union Cabinet : దేశంలో సాంకేతికతను ప్రోత్సహిస్తూ, భారత్‌ను సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో కీలక ముందడుగులు పడుతున్న కేంద్ర ప్రభుత్వం, నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రక్రియకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నాలుగు యూనిట్లను ఏపీ, ఒడిశా, పంజాబ్‌లో ఏర్పాటు చేయనుండగా, మొత్తం రూ.4,594 కోట్ల పెట్టుబడితో వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే దేశంలో ఆరు సెమీకండక్టర్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్న నేపథ్యంలో, తాజాగా ఆమోదం పొందిన ఈ నాలుగు కొత్త ప్రాజెక్టులతో దేశంలో సెమీకండక్టర్ యూనిట్ల మొత్తం సంఖ్య 10కు చేరింది.

Semiconductor Manufacturing
ఇవి నైపుణ్యం కలిగిన యువతకు 2034 నాటికి భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. ఈ ప్రాజెక్టులు టెలికాం, ఆటోమోటివ్, డేటా సెంటర్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సెమీకండక్టర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడతాయి. దేశీయంగా సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయడం ద్వారా విదేశాలపై ఆధారాన్ని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి. అలాగే, “ఆత్మనిర్భర్ భారత్” దిశగా ఇది మరొక భారీ అడుగు కావచ్చని కేంద్రం పేర్కొంది. దేశంలో ఎలక్ట్రానిక్ తయారీకి కావాల్సిన పరికరాల అందుబాటును పెంచే దిశగా ఈ నిర్ణయం కీలకమవుతుంది. ఇది ఎలక్ట్రానిక్స్ తయారీ ఎకోసిస్టమ్‌కు శక్తినివ్వడమే కాకుండా, పరోక్షంగా లక్షలాది ఉద్యోగాలు కల్పించగల సామర్థ్యం కలిగి ఉంది. ఇక, పట్టణ రవాణా వ్యవస్థను బలోపేతం చేసే మరొక కీలక నిర్ణయంగా, ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ మెట్రో ఫేజ్–1బి నిర్మాణానికి కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టు కోసం రూ.5,801 కోట్ల వెచ్చించనున్నారు. మెట్రో నిర్మాణంతో పాటు నగర వృద్ధికి ఇది దోహదపడనుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో 700 మెగావాట్ల సామర్థ్యం గల జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. హిమాలయ ప్రాంతాల్లో పునరుత్పాదక శక్తిని అభివృద్ధి చేయడంలో ఇది కీలకంగా మారనుంది. ఈ అన్ని నిర్ణయాలు, దేశ అభివృద్ధికి గట్టి అడుగులు వేస్తున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా సెమీకండక్టర్ రంగం దేశంలో సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి పునాది వేసేలా మారుతుందని, త్వరితగతిన ఈ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి వెల్లడించారు.
Read Also: Indian Railways : రైల్వే ప్రయాణికులకు శుభవార్త..దేశవ్యాప్తంగా 6,115 స్టేషన్లలో ఉచిత వైఫై