Killi Kruparani : వైసీపీకి కిళ్లి కృపారాణి గుడ్ బై?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన ఆ జిల్లాలోని వైసీపీ అంతర్గత విభేదాలను బయటపెట్టింది.
- Author : Hashtag U
Date : 27-06-2022 - 4:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన ఆ జిల్లాలోని వైసీపీ అంతర్గత విభేదాలను బయటపెట్టింది. మాజీ కేంద్ర మంత్రి కిళ్లి కృపారాణికి అవమానం జరిగింది. ఆమె పేరు ప్రొటోకాల్ జాబితాలో లేకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. స్థానిక నేతల తీరుతో విసిగిపోయిన ఆమె త్వరలోనే పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది.
`జగనన్న అమ్మ ఒడి పథకం` నిధుల విడుదల కోసం సోమవారం శ్రీకాకుళంలో భారీ బహిరంగ సభ జరిగింది. దానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. జగన్ శ్రీకాకుళం చేరకముందే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆయనకు స్వాగతం పలికేందుకు శ్రీకాకుళం ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్దకు చేరుకున్న వైసీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అలిగారు. జగన్‌కు స్వాగతం పలకకుండానే రుసరుసా ఇంటికెళ్లిపోయారు.
శ్రీకాకుళం ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద జగన్‌కు స్వాగతం పలికే పేర్లను అధికారులు ఖరారు చేశారు. అయితే అందులో కృపారాణి పేరు లేదు. ఆ విషయం తెలుసుకున్న ఆమె ఆగ్రహానికి గురైయ్యారు. ప్రొటోకాల్ జాబితాలో పేరు లేనప్పుడు అక్కడ ఎందుకు ఉండాలంటూ కారెక్కి తుర్రుమన్నారు. వెంటనే అప్రమత్తమైప పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మనా కృష్ణదాస్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు ఆమెను బుజ్జగించే యత్నం చేశారు. అయినా, కృపారాణి శాంతించలేదు. కారు వద్ద కు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా విండో గ్లాస్ క్లోజ్ చేసి కృపారాణి కారులో వెళ్లిపోయారు.