Amaravati : అమరావతి అసైన్డ్ భూముల కేసులో ఐదుగురు అరెస్ట్
- Author : Prasad
Date : 13-09-2022 - 10:25 IST
Published By : Hashtagu Telugu Desk
అమరావతి రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో ఐదుగురు వ్యక్తులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. రాజధాని అమరావతిలో 89.8 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని సీఐడీ అభియోగాలు మోపింది. మాజీ మంత్రి నారాయణ బంధువులు, పరిచయస్థుల పేరుతో వేర్వేరు సర్వేనెంబర్లలో అసైన్డ్ భూమి కొనుగోలు చేశారని ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
ఇదిఇలా ఉంటే టీడీపీ మాత్రం దీనిని తీవ్రంగా ఖండించింది. అమరావతి రైతుల పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న అద్భుత స్పందనతో వైసిపి ప్రభుత్వం కుట్రలకు మళ్లీ తెరతీసిందని టీడీపీ ఆరోపించింది. 2014 లో జరిగిన ప్రభుత్వ నిర్ణయాల మీద 2020లో ప్రభుత్వం నమోదు చేసిన కేసులపై కోర్టులు స్టే ఇచ్చాయని అయితే ఇప్పుడు ఆ కేసుల్లో మరికొంత మందిని అరెస్టు చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి జగన్ సర్కారు విఫల యత్నం చేస్తుందని టీడీపీ ప్రకటనలో పేర్కొంది.