YS Sharmila Satirical Tweet: సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఫైర్.. అంత ప్రేమ ఎందుకండి అంటూ?!
పోలవరం ఎత్తును 45.7 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వెనుక అవినీతి ఉందని, ఈ లింక్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఆయకట్టును కుదిస్తుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తెలిపిందని షర్మిల పేర్కొన్నారు.
- By Gopichand Published Date - 02:49 PM, Thu - 17 July 25

YS Sharmila Satirical Tweet: పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila Satirical Tweet) తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టు రూ.81,900 కోట్ల ఖర్చుతో రాష్ట్రానికి గణనీయ ప్రయోజనం చేకూర్చదని, పోలవరం ప్రాజెక్టును దెబ్బతీస్తుందని, రాయలసీమకు కృష్ణా, తుంగభద్ర నీటి హక్కులను విస్మరిస్తుందని ఆమె ఆరోపించారు. రాష్ట్ర మేధావులు, ఇంజనీర్లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని, ఇది కేవలం కాంట్రాక్టర్‌కు లాభం చేకూర్చే “గుదిబండ ప్రాజెక్టు” అని ఆమె అన్నారు.
పోలవరం ఎత్తును 45.7 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వెనుక అవినీతి ఉందని, ఈ లింక్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఆయకట్టును కుదిస్తుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తెలిపిందని షర్మిల పేర్కొన్నారు. 2014 నాటికి వైఎస్ఆర్ ప్రారంభించిన 39కి పైగా జలయజ్ఞం ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. గత 10 ఏళ్లలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఎలాంటి పురోగతి సాధించలేదని, రూ.40 వేల కోట్లతో 50 లక్షల ఎకరాలకు సాగునీరు, కోటి మందికి తాగునీరు అందించవచ్చని షర్మిల విమర్శించారు.
Also Read: Mohammed Shami: కూతురు పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ అయిన టీమిండియా ఫాస్ట్ బౌలర్!
అందరూ వద్దంటున్న పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అంత ప్రేమెందుకో ప్రజలకు అర్థం కావట్లేదు. ఇటు రాష్ట్ర మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్రతిపాదన పనికిరాదని సీమ ప్రొఫెసర్లు చెబుతున్నారు. లక్ష కోట్లకుపైగా ఖర్చు తప్ప ప్రయోజనం లేదని ఇంజినీర్లు…
— YS Sharmila (@realyssharmila) July 17, 2025
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి 2022లో పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి, అంచనా వ్యయాన్ని రూ.55 వేల కోట్ల నుంచి రూ.37 వేల కోట్లకు తగ్గించారని, ఇది బీజేపీకి అనుకూలంగా పోలవరం ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చర్య అని షర్మిల ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుతో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందుతుందని, ఏటా రూ.2,765 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొంది. రూ.81,900 కోట్లతో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు, 80 లక్షల మందికి తాగునీరు, 91.4 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యమని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ, ఇది విభజన చట్టానికి విరుద్ధమని, నాగార్జున సాగర్ హక్కులకు భంగం కలిగిస్తుందని ఆరోపిస్తోంది. బనకచర్ల ప్రయత్నాలను నిలిపివేయాలని, పోలవరాన్ని 45.7 మీటర్ల ఎత్తులో పూర్తి చేయాలని, జలయజ్ఞం ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని షర్మిల డిమాండ్ చేశారు.