Telugu States : ఓ వైపు చలిపులి.. మరోవైపు తుఫాను మేఘాలు
Telugu States : ఓ వైపు తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. మరోవైపు దక్షిణ భారతదేశానికి తుఫాను ముప్పు పొంచి ఉంది.
- Author : Pasha
Date : 17-12-2023 - 7:47 IST
Published By : Hashtagu Telugu Desk
Telugu States : ఓ వైపు తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. మరోవైపు దక్షిణ భారతదేశానికి తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ అరేబియాలో ఏర్పడిన తుఫాను తరహా వాతావరణం తిరువనంతపురం తీరానికి చేరింది. ప్రస్తుతం ఇది శ్రీలంకకు పశ్చిమంగా, తమిళనాడుకు దక్షిణంగా కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు (ఆది, సోమవారాల్లో) తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లలో వర్షాలు కొనసాగే ఛాన్స్ ఉంది. వాస్తవానికి అక్కడ శుక్రవారం నుంచే వానలు పడుతున్నాయి. ఈనేపథ్యంలో ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను తరహా వాతావరణం ఎప్పుడు తీరం దాటుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఎఫెక్టు తెలుగు రాష్ట్రాలపై (Telugu States) ఉంటుందా ?
We’re now on WhatsApp. Click to Join.
ఈ తుఫాను తరహా వాతావరణం వల్ల కొన్ని మేఘాలు తెలుగు రాష్ట్రాల వైపు కదిలి వస్తున్నాయి. ఈ మేఘాలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలలోగా రాయలసీమతో పాటు దక్షిణ తెలంగాణ, కోస్తా ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ఇవి ఈరోజు సాయంత్రంకల్లా వాయవ్య తెలంగాణ తప్ప తెలుగు రాష్ట్రాలలోని మిగతా ఏరియాలలోకి ఆవరించే అవకాశం ఉంది. ఇవాళ అర్ధరాత్రికల్లా ఈ మేఘాలు వాయవ్య తెలంగాణ ప్రాంతంలోనూ ఆవరిస్తాయని భారత వాతావరణ విభాగం విడుదల చేసిన శాటిలైట్ మ్యాప్స్‌ను బట్టి తెలుస్తోంది. ఈవిధంగా వ్యాపించే మేఘాల వల్ల వర్షాలు పడుతాయని మాత్రం చెప్పలేమని వాతావరణ నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే రాయలసీమలో గాలుల వేగం కొంత పెరిగింది. ఈరోజు ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. మనం పైన చెప్పుకున్న తుఫాను తరహా వాతావరణం వల్ల ఇవాళ వర్షం పడుతుందని భారత వాతావరణ విభాగం కూడా చెప్పలేదు.