CM Chandrababu: జైత్రయాత్రలా సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటన!
సీఎం చంద్రబాబు షరఫ్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, బుర్జీల్ హోల్డింగ్స్, మస్టార్, అగ్రియా, లులూ, ADNOC వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
- By Gopichand Published Date - 07:58 PM, Sat - 25 October 25
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) యూఏఈ పర్యటన, మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన అద్భుతమైన ‘జైత్రయాత్ర’లా సాగింది. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే ఏకైక అజెండాగా ముందుకు సాగుతోంది.
ఒకవైపు ముఖ్యమంత్రి యూఏఈలో పెట్టుబడి వేట కొనసాగిస్తుంటే.. మరోవైపు మంత్రి లోకేష్ ఆస్ట్రేలియాలో రాష్ట్రానికి పెట్టుబడుల జాతర తీసుకువచ్చేందుకు కృషి చేశారు. వీరి సమష్టి కృషి ఫలితంగానే నేడు విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్లతో ఏఐ (AI) సిటీ ఏర్పాటుకు గూగుల్ వంటి దిగ్గజ సంస్థ ముందుకు వచ్చింది. వైఎస్సార్సీపీ చేయలేని అభివృద్ధి, తీసుకురాలేనన్ని పెట్టుబడులు, పరిశ్రమలను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకువస్తుందని ఈ పర్యటనలు స్పష్టం చేశాయి.
ప్రపంచ పెట్టుబడుల గమ్యంగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌ను భారత్‌లోనే కాదు.. ప్రపంచ పెట్టుబడుల గమ్యంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈ పర్యటన సాగింది. దుబాయ్, అబుదాబి వంటి దేశాలలో పర్యటించి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, హౌసింగ్ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై అనేక అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో ఆయన చర్చించారు.
దిగ్గజ సంస్థలతో చర్చలు
సీఎం చంద్రబాబు షరఫ్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, బుర్జీల్ హోల్డింగ్స్, మస్టార్, అగ్రియా, లులూ, ADNOC వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ చర్చల్లో లాజిస్టిక్స్, ఆరోగ్య రంగం, షిప్‌బిల్డింగ్, మైనింగ్ వంటి కీలక రంగాలలో పెట్టుబడుల అవకాశాలపై చర్చ జరిగింది.
పెట్టుబడులకు అనువైన వాతావరణంపై ప్రజెంటేషన్
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనువైన వాతావరణాన్ని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు వివరించారు. దేశంలోనే అతిపెద్దదైన 1,054 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం, మెరుగైన పోర్టులు, రహదారులు, ఎయిర్ కనెక్టివిటీతో పాటు సబ్ సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఉన్న రాష్ట్రం కావడం వలన పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూలమైన గమ్యంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Montha Cyclone: మొంథా తుపాను.. పవన్ కళ్యాణ్ కీలక సూచనలు!
అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాలు సాంకేతికత, ఇన్నోవేషన్, పరిశ్రమల కేంద్రాలుగా ఎదుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రం అందిస్తున్న స్థిరమైన పాలన, పారదర్శక విధానాలపై ప్రపంచ పెట్టుబడిదారులు విశ్వాసం ఉంచుతున్నారని సీఎం పేర్కొన్నారు.
CII భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం
విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగబోయే CII భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని యూఏఈలోని పారిశ్రామికవేత్తలను, ప్రభుత్వ ప్రతినిధులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
స్వర్ణాంధ్రంగా ఏపీ
‘మాటలతో కాదు చేతల్లో చూపించడం అంటే ఇదే’ అని కూటమి ప్రభుత్వం నిరూపించింది. కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు, కొత్త అవకాశాలతో రాష్ట్రం మళ్లీ ప్రగతి దిశగా అడుగులు వేస్తోంది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే అజెండాగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి గర్వంగా “స్వర్ణాంధ్రం”గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.