సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్
- Author : Vamsi Chowdary Korata
Date : 13-01-2026 - 2:29 IST
Published By : Hashtagu Telugu Desk
చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నమోదైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు మూసివేసింది. 37 మందిపై విచారణ నిలిపివేస్తూ, సీఐడీ తుది నివేదికను ఆమోదించింది. రూ.371 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలతో నమోదైన ఈ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో ఆయనకు ఊరట లభించింది.
- చంద్రబాబు నాయుడికి భారీ ఊరట
- స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు మూసివేత
- తీర్పు వెల్లడించిన విజయవాడ ఏసీబీ కోర్టు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై నమోదైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై నమోదైన కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది. ఈ కేసులో మొత్తం 37 మందిపై విచారణను నిలిపివేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణపై సీఐడీ సమర్పించిన తుది నివేదికను విజయవాడ ఏసీబీ కోర్టు ఆమోదించింది. దాని ప్రకారం.. చంద్రబాబు నాయుడిపై కేసును క్లోజ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. 2014 సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. స్కిల్ డెవలప్‌మెంట్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ ఆయనపై ఈ కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు సుమారు 53 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. ఈ కేసులో రూ. 371 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందని సీఐడీ ఆరోపించింది. ఈ కేసులో చంద్రబాబు ఏ37 (A37) నిందితుడిగా ఉన్నారు.
ఈ కేసు విచారణ సందర్భంగా తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టు.. “మిస్టేక్ ఆఫ్ ఫాక్ట్స్” (వాస్తవాల పొరపాటు)గా పేర్కొంటూ నిందితులపై విచారణను నిలిపివేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసినట్లు తెలిపింది. ఈ పిటిషన్‌లో తుది నివేదికపై వాదనలు వినాలంటూ ఆయన కోరారు. కోర్టు తీర్పుతో చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది.
గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో.. చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు నమోదైంది. ఈ స్కామ్‌లో సుమారు రూ. 371 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని సీఐడీ ఆరోపించింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ, 2023 సెప్టెంబర్ 9న సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. దీనిపై టీడీపీ ఏసీబీ కోర్టులో, హైకోర్టులో న్యాయ పోరాటం చేసింది.
ఈ కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2023 అక్టోబర్ 31న చంద్రబాబు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత కూడా చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో చంద్రబాబుకు ఊరట లభించింది.