CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు
- Author : Vamsi Chowdary Korata
Date : 13-07-2026 - 9:15 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి చెందిన 117 క్రెస్ట్ గేట్ల మార్పిడి పనులను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సాగే ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులపైనే దృష్టి సారించనున్నారు. ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద కాటన్ బ్యారేజీకి చేరుకుంటారు. అక్కడ గేట్ల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం గోదావరి డెల్టా రైతులతో ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
రూ. 152.95 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 117 పాత గేట్లను తొలగించి, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్, కేంద్ర జలసంఘం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2028 జూలై నాటికి ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గేట్ల మార్పిడితో గోదావరి డెల్టా పరిధిలోని సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరా మరింత మెరుగుపడనుంది.
రైతులతో సమావేశం అనంతరం చంద్రబాబు హెలికాప్టర్‌లో ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. అక్కడ ఈసీఆర్‌ఎఫ్ (ECRF) డ్యామ్, డయాఫ్రమ్ వాల్‌తో పాటు కాలువల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.