CM Chandrababu : ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు..రేపు ప్రధాని మోడీతో భేటి
పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీ చేరుకుని 7 గంటలకు జల మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం అవుతారు.
- By Latha Suma Published Date - 04:43 PM, Fri - 16 August 24

CM Chandrababu: రెండు రోజుల ఢిల్లీ పర్యటన కోసం ఏపి సీఎం చంద్రబాబు బయలుదేరారు. పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీ చేరుకుని 7 గంటలకు జల మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం అవుతారు. ఈరోజు రాత్రికి ఎంపీలతో విందు సమావేశం ఉంటుంది. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. రేపు రాత్రి 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు.
కాగా, చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరకముందు ఆయనతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ సమావేశమయ్యారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో ఏపీలో పెట్టుబడుల అంశంపై వారు చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి గురించి మాట్లాడుకున్నారు.
ఇటీవల కేంద్ర బడ్జెట్ 2024-25లో అమరావతికి ప్రత్యేక సాయంగా కేంద్రం రూ.15 వేల కోట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని కూడా ప్రధాని మోడీని చంద్రబాబు కోరనున్నారని తెలుస్తోంది. ఇదిలావుండగా.. ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కలిశారు. ఏపీ ఆర్థిక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.