AP Govt : ఆక్వా సంక్షోభంపై కమిటీ ఏర్పాటు.. త్వరలో ఢిల్లీకి సీఎం చంద్రబాబు
- By News Desk Published Date - 11:37 PM, Mon - 7 April 25

AP Govt : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనా సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. భారత్ పై 26శాతం ప్రతీకార సుంకాన్ని విధించారు. ట్రంప్ నిర్ణయంతో దేశంలోని ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. మామూలు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రోజుకు సుమారు 800-1000 టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతాయని అంచనా. 2023-24లో దేశవ్యాప్తంగా మొత్తం 7,16,004 టన్నుల రొయ్యలు ఎగుమతి అయ్యాయి. అంటే సగటున రోజుకు 1,960 టన్నులు వస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 70శాతం. ట్రంప్ దెబ్బతో ఈ ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఆక్వా రంగంపై సుంకాలు తగ్గించేలా యూఎస్ ప్రభుత్వంలో చర్చించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆక్వారంగం సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
అక్వారంగం సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలో ఆక్వా రైతులు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, అధికారులు పాల్గొన్నారు. భారత్ ఉత్పత్తులపై అమెరికా సుంకాల విధింపుతో నష్టాల్లో ఆక్వారంగం కూరుకుపోయిందని చంద్రబాబు నాయుడు అన్నారు. యూఎస్ సుంకాల వల్ల ఏర్పడిన ఆక్వా సంక్షోభంపై కమిటీ ఏర్పాటు చేశారు. ఆక్వా రైతులు, ఎగుమతిదారులు, ట్రేడర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఆక్వా సమస్యలపై కేంద్ర వాణిజ్య మంత్రిని త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు కలుస్తారని చెప్పారు.
Also Read: YS Sharmila: ఈ జన్మకు మారరు.. పచ్చకామెర్ల రోగం ఇంకా తగ్గలేదా..? జగన్‌పై షర్మిల ఫైర్
భారత్ ఉత్పత్తులపై అమెరికా సుంకాల విధింపుతో ఆక్వా రంగం నష్టాల్లో కూరుకుపోయింది. రోయ్యల చెరువులకు తాజా నీరు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు అంగీకారని ఆనం అన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఆక్వా ఉత్పత్తుల విలువ జోడింపుపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఆక్వా ఎగుమతులకు ప్రత్యామ్నాయాలు చూడాలని సూచించారు. చైనా, థాయిలాండ్ కు ఎగుమతి చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారని ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. 100 కౌంట్ రొయ్యలను రూ.220 కు కొనేందుకు ఎగుమతిదారులు అంగీకరించారు. ప్రస్తుతం ఆక్వా రైతులు ఎక్కడా క్రాఫ్ హాలిడే నిర్ణయం తీసుకోలేదు. ఆక్వా రైతులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వెంకటరమణారెడ్డి అన్నారు.