Cinema Politics: మెగాస్టార్ పెద్దరికానికే జగన్ జై!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎవరు? చిరంజీవినా? మోహన్‌బాబా? ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు ఉండగా సీఎం జగన్ మెగాస్టార్ చిరంజీవి ఒక్కరినే పిలవడం ఏంటి?
- By Hashtag U Published Date - 08:30 AM, Sat - 15 January 22

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎవరు? చిరంజీవినా? మోహన్‌బాబా? ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు ఉండగా సీఎం జగన్ మెగాస్టార్ చిరంజీవి ఒక్కరినే పిలవడం ఏంటి? అందుకే చాలా మందికి కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయి. ఇండస్ట్రీలో పెద్దరికం తనకు వద్దని ఇటీవల ప్రకటించారు చిరంజీవి.
ఆ వెంటనే మోహన్‌బాబు రండి కలిసి నడుద్దామని సినీ ప్రముఖులకు పిలుపునిచ్చారు. చిరంజీవి పెద్దరికం వద్దన్నారు కాబట్టి ఇక మోహన్‌బాబే లీడ్ తీసుకుంటారని అందరూ ఊహించారు. ఏపీ ప్రభుత్వం వైపు నుంచి అందుకు భిన్నమైన అడుగు పడినట్లే కనిపిస్తోంది. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించేందుకు తాను సిద్ధమని మోహన్‌బాబు ప్రకటించినా ఆయనతో టచ్‌లోకి వెళ్లేందుకు వైసీపీ పెద్దలెవరూ పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. ఆయన కుటుంబంతో ఉన్న బంధుత్వాలు, గత సాన్నిహిత్నం కూడా ఇక్కడ వర్కవుట్ కాలేదు.
పైగా అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఒక్కరికే సీఎం జగన్ నుంచి పిలుపు రావడం ఇండస్ట్రీలో ఇప్పుడో హాట్‌టాపిక్. అసలే చిరంజీవికి, మోహన్‌బాబుకు మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతున్న సమయంలో సీఎం జగన్ చిరంజీవిని లంచ్ మీటింగ్‌కి పిలిచి మరీ సమస్యలపై చర్చించడం మోహన్‌బాబు అనుచరులకు మింగుడుపడని అంశమే. టికెట్ ధరలు, ధియేటర్ల మూసివేతపై నెల రోజుల నుంచి వివాదం జరుగుతున్నా మా అధ్యక్షుడిగా మంచు విష్ణు వైపు నుంచి కానీ, మోహన్‌బాబు వైపు నుంచి కానీ రియాక్షన్ రాలేదు. చిరంజీవి పెద్దరికం వద్దన్న కొద్ది గంటల్లోనే ఆ బాధ్యత తీసుకునేందుకు ముందుకొచ్చారు మోహన్‌బాబు.
ఇలాంటి టైమ్‌లో మోహన్‌బాబునో లేదంటే, ఇండస్ట్రీలో ప్రముఖులందరినో పిలిచి మాట్లాడితే మరోలా ఉండేది కానీ, కేవలం చిరంజీవి ఒక్కరినే లంచ్ మీటింగ్‌కు పిలవడం టాలీవుడ్‌లో కోల్డ్ వార్ కొత్త పొలిటికల్ టర్నింగ్ తీసుకున్నట్లుగానే కనిపిస్తోంది. అంటే ఒకరకంగా సినీ పరిశ్రమలో చిరంజీవి పెద్దరికానికే వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ జైకొడుతున్నట్లు కనిపిస్తోంది.