CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- Author : Prasad
Date : 02-06-2026 - 8:58 IST
Published By : Hashtagu Telugu Desk
తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో చంద్రబాబు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గోన్నారు.కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ అందజేశారు. కుటుంబ పరిస్థితులను స్వయంగా తెలుసుకుని, సింహాచలం కుటుంబానికి మరింత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలానికి రూ.4 వేల పెన్షన్‌ను అందజేసిన సీఎం, ఇంటికే వచ్చి పెన్షన్ సక్రమంగా అందుతున్నదా లేదా అని ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ అందుతోందని సింహాచలం ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా తనకు సొంతిల్లు లేదని, ఇంటికి ట్యాప్ కనెక్షన్ కూడా లేదని సింహాచలం సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, సింహాచలానికి ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు తాగునీటి కనెక్షన్ కూడా కల్పించాలని అధికారులను ఆదేశించారు. కల్లు గీయడం ద్వారా నెలకు రూ.5 నుంచి రూ.6 వేల వరకు మాత్రమే ఆదాయం మిగులుతుందని, ప్రభుత్వం అందించే పెన్షన్ కుటుంబానికి ఎంతో అండగా నిలుస్తోందని సింహాచలం తెలిపారు. తన కుటుంబానికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.
కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. కల్లుగీత కార్మికులకు సబ్సిడీపై మద్యం దుకాణాల కేటాయింపులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వారి జీవనోపాధి మెరుగుపడేలా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యటనలో భాగంగా కల్లు గీత విధానాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. తాటిచెట్టు నుంచి తాజాగా తీసిన కల్లును రుచి చూసి కార్మికులతో మాట్లాడారు. అనంతరం సింహాచలం కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి, ఆయన మనవడిని ముద్దాడారు. సింహాచలం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన సీఎం, పేదల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.