Malla Reddy : ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు స్పీడ్ : మల్లారెడ్డి ప్రశంసలు
ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు గారు ఏపీలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ఏపీ అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయిస్తున్నారు. ఈ కలయికతో రాష్ట్రం అభివృద్ధి శిఖరాలు అధిరోహిస్తోంది అని మల్లారెడ్డి తెలిపారు.
- By Latha Suma Published Date - 10:32 AM, Tue - 9 September 25

Malla Reddy : ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు గారు ఏపీలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ఏపీ అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయిస్తున్నారు. ఈ కలయికతో రాష్ట్రం అభివృద్ధి శిఖరాలు అధిరోహిస్తోంది అని మల్లారెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఆనవాయితీ ఉందని ఆయన తెలిపారు. గత ఏడాది స్వామివారిని దర్శించుకున్నప్పుడు విద్యా రంగం అభివృద్ధి కావాలని కోరుకున్నానని, తన ఆధ్వర్యంలో దేశంలోనే మూడు ప్రముఖ డీమ్డ్ యూనివర్శిటీలు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు.
Read Also: AP : రైతుల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ‘అన్నదాత పోరు’ ..రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు
తెలంగాణలో గత పదేళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ అపూర్వమైన అభివృద్ధిని సాధించారని మల్లారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ పాత్ర అశేషం. మల్టీనేషనల్ కంపెనీలు, ఐటీ సంస్థలు వరుసగా హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం కేటీఆర్ నాయకత్వ ఫలితం అని ప్రశంసించారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ కాస్త మందగించిందని, గతంలో ఆంధ్రాలో ఉన్న ఆస్తులను విక్రయించి హైదరాబాద్‌కు వచ్చేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. ఇప్పుడు తెలంగాణలోని ప్రజలు ఏపీలో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపార అవకాశాలు అక్కడ పెరుగుతున్నాయి. ఇది చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి నిదర్శనం అని వివరించారు. మళ్లీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వస్తే గతంలోలాగా తెలంగాణలో తిరిగి అభివృద్ధి జోరందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా తిరుమల స్వామి వారి ఆశీస్సులు అందుకున్న మల్లారెడ్డి, ప్రజల సంక్షేమం కోసం తాను రాజకీయాల్లో కొనసాగుతానని, రాష్ట్రాల మధ్య సహకారమే అభివృద్ధికి మార్గమని అన్నారు.