HappyBirthdayNBK: బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్
- Author : Vamsi Chowdary Korata
Date : 10-06-2026 - 9:55 IST
Published By : Hashtagu Telugu Desk
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన బాలకృష్ణకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్ట్ చేశారు. తన బావమరిది బాలకృష్ణను తన ఆప్తుడు, నటసింహం అని సంబోధిస్తూ ఆయన సేవలను కొనియాడారు.
ఈ మేరకు చంద్రబాబు తన పోస్టులో.. “సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
“ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నవరస నటనా సార్వభౌముడు, తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులు మీపై కలకాలం ఉండాలని కోరుకుంటూ మరొక్క మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను,” అని చంద్రబాబు తన పోస్టులో రాశారు. ఈ పోస్టుకు #HappyBirthdayNBK అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జతచేశారు.