ప్రధాని రేసులో సీఎం చంద్రబాబు?!
మోడీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని పదవికి మొదటి వరుసలో ఉన్నారు. పార్టీపై ఆయనకున్న పట్టు, ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్న గుర్తింపు దీనికి ప్రధాన కారణాలు.
- Author : Gopichand
Date : 22-12-2025 - 4:25 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu: భారత రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే ప్రశ్న అందరినీ తొలుస్తోంది.. ‘ప్రధాని మోడీ తర్వాత ఎవరు?’. 2024 ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఈ చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ ప్రచురించిన ఒక ప్రత్యేక కథనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. 2029 నాటికి ప్రధాని మోడీ వయస్సు 79 ఏళ్లకు చేరుతుందన్న అంచనాతో ఆయన వారసులెవరనే కోణంలో రాయిటర్స్ ఆసక్తికర విశ్లేషణను వెలువరించింది.
బీజేపీలో రేసులో ఉన్నది వీరేనా?
రాయిటర్స్ విశ్లేషణ ప్రకారం.. మోడీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని పదవికి మొదటి వరుసలో ఉన్నారు. పార్టీపై ఆయనకున్న పట్టు, ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్న గుర్తింపు దీనికి ప్రధాన కారణాలు. ఇక మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన దేవేంద్ర ఫడ్నవీస్ పేరును కూడా రాయిటర్స్ పరిగణనలోకి తీసుకోవడం విశేషం.
అయితే క్షేత్రస్థాయిలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరును రాయిటర్స్ విస్మరించడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా పేరున్న యోగిని కాదని ఫడ్నవీస్ పేరును ప్రస్తావించడం వెనుక రాయిటర్స్ లాజిక్ ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Also Read: విలియమ్సన్ టెస్ట్ రిటైర్మెంట్? కివీస్ దిగ్గజం కీలక వ్యాఖ్యలు!
అనూహ్యంగా తెరపైకి చంద్రబాబు, లోకేశ్ పేర్లు!
ఈ కథనంలో అత్యంత విడ్డూరమైన, ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ప్రధాని రేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పేర్లను రాయిటర్స్ ప్రస్తావించడం. 2029లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా ఎన్డీయే (NDA) కూటమిలోని ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే అప్పుడు దక్షిణాది నేతగా చంద్రబాబుకు అవకాశం దక్కవచ్చని రాయిటర్స్ అభిప్రాయపడింది.
వాస్తవ పరిస్థితులు ఏంటి?
రాయిటర్స్ విశ్లేషణలో కొన్ని ప్రాథమిక అంశాలు క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా ఉన్నాయని రాజకీయ పండితులు భావిస్తున్నారు. 2029 నాటికి మోడీ కంటే చంద్రబాబు ఆరు నెలలు పెద్దవారు. వయస్సు రీత్యా మోడీ తప్పుకుంటే అంతకంటే పెద్దవారైన చంద్రబాబును బీజేపీ అగ్రనాయకత్వం ఎలా అంగీకరిస్తుంది? అనేది ప్రధాన ప్రశ్న. గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ వంటి హేమాహేమీ నేతలు ఉండగా ఒక ప్రాంతీయ పార్టీ నేతకు ప్రధాని పీఠాన్ని అప్పగించే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు. చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ తమకు ప్రధాని కావాలనే ఆకాంక్షను ఎప్పుడూ వ్యక్తం చేయలేదు. “నా దృష్టి అంతా ఏపీ అభివృద్ధి పైనే” అని చంద్రబాబు పలుమార్లు స్పష్టం చేశారు.
భవిష్యత్తు సమీకరణాలు ఎలా ఉండవచ్చు?
రాజకీయ వర్గాల్లో సాగుతున్న ప్రచారం ప్రకారం.. 2029లో కేంద్రంలో ఎన్డీయే మళ్ళీ అధికారంలోకి వస్తే చంద్రబాబుకు జాతీయ స్థాయిలో రాష్ట్రపతి లేదా గవర్నర్ వంటి గౌరవప్రదమైన పదవులు దక్కవచ్చని, ఆ సమయంలో ఏపీ బాధ్యతలను లోకేశ్‌కు అప్పగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ‘ప్రధాని పదవి’ అనేది మాత్రం ప్రస్తుతానికి అతిశయోక్తిగానే తోస్తోంది.