Bala Krishna : బాలయ్యకి చంద్రబాబు, లోకేష్ స్పెషల్ విషెస్..
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సోషల్ మీడియా ఖాతాలో బాలకృష్ణకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. "వెండి తెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను సంపాదించిన మీరు, నిండు నూరేళ్ళూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 11:17 AM, Tue - 10 June 25

Bala Krishna : ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ పాలిట్బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాల నుంచి అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన బాలకృష్ణ పుట్టినరోజును టీడీపీ నాయకులు, అభిమానులు పండుగలా జరుపుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, ర్యాలీలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. బాలకృష్ణ సేవా కార్యక్రమాలతో పాటు తన చిత్రాల ద్వారా కోట్లాది మందిని ఆకట్టుకున్న తారగా నిలిచారు.
Read Also: Walking : వాకింగ్ చేస్తే కీళ్లు అరిగిపోతాయా?
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సోషల్ మీడియా ఖాతాలో బాలకృష్ణకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. “వెండి తెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను సంపాదించిన మీరు, నిండు నూరేళ్ళూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను” అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా బాలకృష్ణకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “సిల్వర్ స్క్రీన్‌పై లెజెండ్.. పొలిటికల్ స్క్రీన్‌పై అన్‌స్టాపబుల్.. ప్రజల గుండెల్లో బాలయ్య.. నా ముద్దుల మావయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ లోకేష్ తన సందేశాన్ని పేర్కొన్నారు. ఆయన ఈ శుభాకాంక్షలు ఎక్స్ ద్వారా పంచుకున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోనూ బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అఖిలాండం వద్ద టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ నేతృత్వంలో 650 టెంకాయలు కొట్టి, 6.5 కిలోల కర్పూరాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలకృష్ణ ఆయురారోగ్యాలతో, ఇంకా ఎక్కువ సేవలందించే స్థితిలో ఉండాలని ప్రార్థిస్తూ మొక్కులు చెల్లించుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా, బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ 2 పై కూడా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలవగా, ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ విధంగా సినీ రంగంలోనే కాకుండా, సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన బాలయ్య పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా సందడి చేస్తున్నాయి.
Read Also: Trivikram – Charan : త్రివిక్రమ్-చరణ్ కాంబోలో మూవీ..జులై లో సెట్స్ పైకి..?