Viveka Murder Case : కడపకు చౌరాసియా.. వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు..!
- By HashtagU Desk Published Date - 02:59 PM, Fri - 18 February 22

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఏపీలోని కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో మకాం వేసిన సీబీఐ డీఐజీ చౌరాసియా, వివేకా హత్య కేసుపై అధికారులతో ఆరా తీస్తున్నారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా వాంగ్మూలం పత్రాలను, సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో సమర్పించనున్నారు. విచారణ ముమ్మరంగా సాగుతున్న నేపధ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరితో మరోసారి కోర్టులో వాంగ్మూలం నమోదు చేయించనున్నారని సమాచారం. దస్తగిరి అప్రూవర్‌గా మారుతున్న క్రమంలో, 306 సెక్షన్ కింద సాక్ష్యం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సీబీఐ వాదనలతో ఏకీభవించిన కడప సబ్ కోర్టు, దస్తగిరిని అప్రూవర్‌గా మారేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో మరోసారి మెజిస్ట్రేట్ ముందు దస్తగిరి వాంగ్మూలం నమోదు చేయించనున్నారు.
ఇక మరోవైపు వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకున్నక్రమంలో ఢిల్లీ నుంచి సీబీఐ డీఐజీ చౌరాసియా కడపకు రావడం చర్చనీయాంశం అవుతోంది. కడపలో సీబీఐ అధికారులతో సమావేశమైన చౌరాసియా, వివేక హత్య కేసు పురోగతిపై సీబీఐ అధికారులతో చర్చించారు. వారం రోజులపాటు కడప జిల్లాలోనే ఉండి వివేకా హత్యకేసును పరీశీలించనున్నారని తెలుస్తోంది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే కోర్టులో రెండు చార్జి షీట్లు వేయడంతో పాటు ఐదుగురిని నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. అలాగే మరికొందరి ప్రమేయం పై కూడా విచారణ చేస్తుంది. ఈ క్రమంలో త్వరలోనే అరెస్టులు జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ఢిల్లీ నుండి సీబీఐ అధికారి రావడం హాట్ టాపిక్‌గా మారింది.