Fraudulent Scheme : భారీ లాభాల ఆశతో చీటింగ్ యాప్స్ దందా.. ఏపీలో సీబీఐ రైడ్స్
Fraudulent Investment Scheme : బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీ వంటి వాటిలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ జనాలను నమ్మించి కుచ్చుటోపీ పెడుతున్న యాప్‌ల బండారం బయటపడింది.
- By Pasha Published Date - 04:19 PM, Wed - 1 May 24
Fraudulent Scheme : బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీ వంటి వాటిలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ జనాలను నమ్మించి కుచ్చుటోపీ పెడుతున్న యాప్‌ల బండారం బయటపడింది. హెచ్‌పీజెడ్ టొకెన్ యాప్ పెట్టుబడి పథకం పేరుతో నడుస్తున్న చీటింగ్ సీబీఐ దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ యాప్ ద్వారా పెట్టుబడులను సేకరిస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. ఈనేపథ్యంలో కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలు సహా 10 రాష్ట్రాల్లోని 30 చోట్ల సోదాలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, జోధ్‌పూర్, ముంబై, బెంగళూరు, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో సీబీఐ రైడ్స్ జరిగాయి. ఈ పెట్టుబడి స్కీం ద్వారా ఎంతమందికి కుచ్చుటోపీ పెట్టారు ? ఎంతమేరకు పెట్టుబడులను సేకరించారు ?అనే వివరాలను తెలుసుకునే పనిలో సీబీఐ నిమగ్నమైంది.
We’re now on WhatsApp. Click to Join
లిలియన్ టెక్నోక్యాబ్, షిగూ టెక్నాలజీ కంపెనీలకు హెచ్‌పీజెడ్ టొకెన్ యాప్ మోసంలో భాగస్వామ్యం ఉందని సీబీఐ అనుమానిస్తోంది. దీంతో ఆయా కంపెనీల డైరెక్టర్లపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. లిలియన్ టెక్నోక్యాబ్, షిగూ టెక్నాలజీ కంపెనీలు కూడా బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీ వంటి వాటిలో పెట్టుబడుల ద్వారా భారీగా లాభాలు వస్తాయని ప్రజలను మోసం చేస్తున్నాయి. తాజాగా సీబీఐ జరిపిన దాడుల్లో పెట్టుబడుల సేకరణకు సంబంధించిన డిజిటల్ పత్రాలు, వ్యాపార లావాదేవీలతో ముడిపడిన ఇతరత్రా ఆధారాలు లభ్యమయ్యాయి. ఆయా కంపెనీలకు సంబంధించిన మొబైల్ ఫోన్‌లు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లు, సిమ్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, ఈ-మెయిల్ అకౌంట్ వివరాలు, వివిధ డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు సీజ్ చేశారు. ప్రజలను నమ్మించి పెట్టుబడులను సేకరించిన ఈ కంపెనీలు దాదాపు 150 బ్యాంకు ఖాతాలను వాడాయని వెల్లడైంది. ఎంతోమంది ప్రజలు అత్యాశతో, డబ్బులు త్వరగా రెట్టింపు అవుతాయని భావనతో ఈ సంస్థల స్కీమ్‌లలో పెట్టుబడులను(Fraudulent Investment Scheme) పెట్టినట్లు గుర్తించారు.