Goldy Brar : మూసేవాలా హత్య కేసు నిందితుడు గోల్డీ బ్రార్ మర్డర్
Goldy Brar : 2022 సంవత్సరం మే 9వ తేదీన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య జరిగింది.
- By Pasha Published Date - 03:45 PM, Wed - 1 May 24

Goldy Brar : 2022 సంవత్సరం మే 9వ తేదీన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్(Goldy Brar) అని అప్పట్లో చర్చ జరిగింది. అంతేకాదు మూసేవాలా మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా గోల్డీ బ్రార్ పేరునే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. కట్ చేస్తే.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.25 గంటలకు గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ హత్యకు గురయ్యాడు. అమెరికాలోని హోల్ట్ అవెన్యూలో అతడి మర్డర్ జరిగింది. గోల్డీ బ్రార్ ఇంటి బయట నిలబడి ఉన్న టైంలో గుర్తు తెలియని దుండగలు కాల్చి చంపి పారిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై అక్కడి పోలీసులు ఇంకా ఎలాంటి ప్రకటన కూడా వెలువరించలేదు. అయితే ఆ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా.. ఓ వ్యక్తి చనిపోయాడని మాత్రం పోలీసులు ధ్రువీకరించారు. గోల్డీ బ్రార్ ప్రత్యర్థులైన ఆర్ష్ దల్లా, లఖ్బీర్ లండాలే ఈ హత్య వెనుక ఉన్నారని అనుమానిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
అమెరికా, కెనడాలలో కొన్నేళ్లుగా ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ను భారత ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతేకాదు.. అతడి పేరును మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా చేర్చింది. నిషేధిత ఖలిస్థానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో కలిసి అతడు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వెల్లడించింది. ఉగ్రవాదులు భారత దేశంలోకి చొరబడటానికి సహకారం అందించడంతోపాటు హత్య కేసుల్లోనూ గోల్డీ బ్రార్ ప్రమేయం ఉన్నదని హోంశాఖ తెలిపింది.
Also Read : Ilaiyaraaja Copyright Notice: రజనీకాంత్ కు షాక్ ఇచ్చిన ఇళయరాజా.. నోటీసులు
గోల్డీ బ్రార్ ఎవరు?
సతీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పంజాబ్‌లోని శ్రీ ముక్త్సార్ సాహిబ్‌లో 1994లో జన్మించాడు. ఇతడి తండ్రి పోలీస్ ఇన్‌స్పెక్టర్. తొలిసారిగా సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన లారెన్స్ బిష్ణోయ్‌తో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్‌కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దాంతోపాటు పలువురికి బెదిరింపు ఫోన్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇతడిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని హత్య కేసుల్లోనూ గోల్డీ బ్రార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.