Janasena Pawan Kalyan : జనసేన పై ‘శెట్టి బలిజ’ మంత్రాంగం
గోదావరి జిల్లాల్లో కాపు, బలిజ, శెట్టి బలిజ సామాజికవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. కాపు, బలిజల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ ఆ రెండు వర్గాలను శెట్టి బలిజ వ్యతిరేకిస్తోంది.
- By CS Rao Published Date - 02:03 PM, Wed - 30 March 22

గోదావరి జిల్లాల్లో కాపు, బలిజ, శెట్టి బలిజ సామాజికవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. కాపు, బలిజల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ ఆ రెండు వర్గాలను శెట్టి బలిజ వ్యతిరేకిస్తోంది. ఆ విషయాన్ని జనసేన ఆవిర్భావసభలో పవన్ కల్యాణ్ ప్రస్తావించిన విషయం గుర్తుండే ఉంటుంది. గోదావరి జిల్లాల్లో బలిజ, శెట్టి బలిజల మధ్య చాలా గ్యాప్ ఉంది. ఇరు వర్గాలుగా ఉంటూ రాజకీయంగా పోరాడుతూ ఉంటారు. తొలి నుంచి శెట్టి బలిజలు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులుగా ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తుంటాయి. 2019 ఎన్నికల్లో ఆ వర్గం వైసీపీ వైపు మళ్లిందని ఆ పార్టీ అంచనా. అందుకే, ఇప్పుడు మంత్రివర్గం పునర్వవస్థీకరణ సందర్భంగా శెట్టి బలిజలకు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యం ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.కాపు, బలిజల మధ్య కొంత గ్యాప్ ఉంది. స్వర్గీయ దాసరి నారాయణరావు బతికున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీ కేంద్రంగా ఎవరు బలిజ? ఎవరు కాపు? అనే అంశం ఒకానొక సందర్భంలో చర్చకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, దాసరి నారాయణ రావు సామాజిక వర్గాల మధ్య ఆనాడు పెద్ద చర్చ జరిగింది. అయితే, ఆ రెండు కులాలు వేర్వేరు కాదనే ధోరణిలో రాజకీయంగా కలిసిపోతున్నారు. కానీ, శెట్టి బలిజలు మాత్రం ఆ రెండు తెగలకు దూరంగా ఉంటారని గోదావరి జిల్లాల్లోని సామాజిక పరిస్థితులపై అవగాహన కలిగిన వాళ్ల అభిప్రాయం. అందుకే, జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. జనసేనాని పవన్ కల్యాణ్ కుల సమీకరణపై రాజకీయంగా దెబ్బతీసేలా మంత్రివర్గం మార్పులు చేయడానికి జగన్ సిద్ధం అవుతున్నాడని సమాచారం.
గోదావరి జిల్లాల్లో రాజకీయంగా, సామాజికంగా ప్రభావం చూపే శెట్టి బలిజ వర్గానికి ప్రాధాన్యత పెంచాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తాడేపల్లి వర్గాల వినికిడి. ఆ క్రమంలో ఇప్పటికే పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభకు వైసీపీ పంపింది. ఆ స్థానంలో అదే వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణకు కేబినెట్ లోకి జగన్ తీసుకున్నాడు. ఈసారి కూడా అతన్ని కొనసాగించడానికి సిద్ధం అయినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా నుంచి మోపిదేవి వెంకట రమణ తొలి మంత్రివర్గంలో ఉన్నాడు. ఆయన్ను రాజ్యసభకు పంపడం ద్వారా మత్స్యకారులకు ప్రాధాన్యం జగన్ ఇచ్చాడు. ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన అప్పరాజును మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం విదితమే. ఇప్పుడు అతన్ని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక సామాజిక వర్గాల సమీకరణ సమతుల్యత కోసం బోయ వాల్మీకి వర్గానికి చెందిన కర్నూలు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న జయరాములు ను కేబినెట్ నుంచి తొలిగించే అవకాశం లేకపోవచ్చు. ఇక చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డిని కొనసాగిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది.
నలుగురు మినహా మిగిలిన వారిని మొత్తంగా తప్పించాలని జగన్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఈ సారి మహిళలకు అయిదు స్థానాలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. అంతేకాదు, రెడ్డి వర్గానికి మూడుకు తగ్గనుంది. ఆ మూడు స్థానాల్లో చిత్తూరు నుంచి రోజా.. కర్నూలు నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి.. నెల్లూరు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్లు ఖరారు చేసినట్లు తాడేపల్లి టాక్.కాపు సామాజిక వర్గం నుంచి విశాఖ నుంచి గుడివాడ అమర్నాధ్, తూర్పు గోదావరి నుంచి దాడిశెట్టి రాజా, పశ్చిమ గోదావరి నుంచి గ్రంధి శ్రీనివాస్, గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు లేదా క్రిష్నా జిల్లా నుంచి సామినేని ఉదయభాను పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మైనార్టీ వర్గం నుంచి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ , ఎస్టీ వర్గం నుంచి స్పీకర్ గా రాజన్న దొర కు పేరు వినిపిస్తోంది. ఒక వేళ స్పీకర్ కాకుంటే మంత్రిగా పరిశీలించే అవకాశం ఉంది. క్షత్రియ వర్గం నుంచి ప్రసాద రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వైశ్య వర్గం నుంచి కోలగొట్ల వీరభద్రస్వామికి అవకాశం ఉంది. కమ్మ వర్గం నుంచి వసంత క్రిష్ణప్రసాద్ పేరు వినిపిస్తున్నప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్న తలశిల రఘురాంకు అవకాశం ఇస్తారనే టాక్ ఉంది.
మిగిలిన సామాజికవర్గాల నుంచి ధర్మాన ప్రసాద రావు, తమ్మినేని సీతారాం.. కొలుసు పార్ధసారధి.. పాన్నాడ సతీష్ కుమార్.. విడదల రజనీ.. ఉషశ్రీ చరణ్.. తలారి వెంకటరావు.. మేరుగ నాగార్జున.. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తదితరుల పేర్లు మంత్రివర్గంలో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు ఎమ్మెల్సీలకు ఈ విస్తరణలో ఛాన్స్ ఉంటుందని చర్చ సాగుతోంది.
మొత్తం మీద ముగ్గురు లేదా నలుగురు మినహా ఈసారి క్యాబినెట్ కొత్త మొఖాలతో కనిపించనుంది. ఏప్రిల్ 8వ తేదీన ఇప్పుడున్న మంత్రివర్గంలో జగన్ సమావేశం కాబోతున్నారు. ఆ రోజున కొత్త మంత్రుల పేర్లు కొంత మేరకు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, పాత మంత్రులకు వీడ్కోలు, కొత్త మంత్రులకు ఆహ్వానం పలుకుతూ హై టీ కార్యక్రమాన్ని జగన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 11న కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం ఉంటుందని సమాచారం. ఆ తేదీ పై గవర్నర్ వద్ద సీఎం జగన్ ప్రస్తావించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. మొత్తం మీద 90శాతం క్యాబినెట్ ఔటన్నమాట. అయితే, శెట్టి బలిజలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పవన్ కుల సమీకరణంపై జగన్ అస్త్రాన్ని సంధించనున్నాడని టాక్.