Pawan Kalyan: పొత్తులో సీఎం పదవి అడగలేం.. పవన్ కళ్యాణ్ పరోక్ష సంకేతం
గత ఎన్నికల్లో 30 నుంచి 40 స్థానాల్లో గెలిచుంటే పొత్తులో సీఎం పదవి డిమాండ్ చేయడానికి అవకాశం ఉండదని జనసేనని పవన్ (Pawan) అన్నారు.
- By CS Rao Published Date - 10:10 PM, Thu - 11 May 23

Andhra Pradesh Politics : గత ఎన్నికల్లో 30 నుంచి 40 స్థానాల్లో గెలిచుంటే పొత్తులో సీఎం పదవి డిమాండ్ చేయడానికి అవకాశం ఉండేదని జనసేనని పవన్ (Pawan) అన్నారు. ఇప్పుడు సీఎం పదవిని డిమాండ్ చేయలేమని పరోక్షంగా తేల్చేశారు. మంగళగిరిలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడారు.
నేను కష్టపడి పని చేస్తే ముఖ్యమంత్రి పదవి అదే వస్తుంది అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి వస్తేనే పొత్తులు పెట్టుకోవాలని కొందరు అంటున్నారు.. గత ఎన్నికల్లో 30 నుంచి 40 స్థానాలు గెలిచి ఉంటే ఆ వాదనకు బలం చేకూరేదని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి వరించాలి తప్ప వెంపర్లాడను అన్నారు. మా గౌరవానికి భంగం కలగకుండా ఉంటే కలసి ముందుకు వెళ్తామని, వైసీపీ దాష్టికాలను బలంగా ఎదుర్కొంటామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేసులో నేను లేను అంటే కొందరికి ఆనందంగా ఉంటుందని చెప్పారు. నన్ను ముఖ్యమంత్రిని చేయాలని టీడీపీ, బీజేపీలను అడగనన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చేస్తుంటే చూస్తూ ఊరుకోమని.. పొత్తులపై కూర్చుని మాట్లాడుకుంటాం.. అవసరం అయితే ఒప్పిస్తామన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో సమావేశం తర్వాత అదే విషయం వెల్లడించినట్టు తెలిపారు. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి ఇక్కడే ఉండి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానన్నారు. గురువారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
పవన్ (Pawan) చెప్పిన ముఖ్య అంశాలు:
- “వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వం. గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఏడు శాతం ఓటు సాధించింది. మాకు బలమున్న నియోజకవర్గాల్లో 30 శాతం కూడా ఓట్లు వచ్చాయి. 2014లో పార్టీ పెట్టిన నెల రోజుల్లో అభ్యర్ధుల కోసం వెతుకులాట ఇష్టం లేకే రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని టీడీపీ – బీజేపీల కూటమికి మద్దతిచ్చాం.
- జనసేన బలం రెట్టింపు అయ్యింది 2019లో 137 స్థానాల్లో పోటీ చేసి పార్టీని పూర్తి స్థాయిలో నిలబెట్టాం. ఇప్పుడు పార్టీ మీద విమర్శలు చేస్తున్న వారు ఎవరూ అప్పుడు నాకు నిలబడలేదు. జనసేనకు సలహాలు ఇద్దామనుకున్న వారు గత ఎన్నికల్లో 30 – 40 స్థానాలు గెలిపించలేకపోయారు. ముఖ్యమంత్రి పదవి మనం డిమాండ్ చేయాలి అంటే మనం కనీసం 30-40 స్థానాలు గెలిచి ఉండాలి. పెద్దన్న పాత్ర వహించడం అంటే బాధ్యత వహించడం. రాజకీయం అంటే కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. నా వరకు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే మాట్లాడుతాను. రాష్ట్ర భవిష్యత్తుని బలోపేతం చేయడానికే మా ప్రయాణం. ప్రస్తుతం జనసేన పార్టీ బలం పెరిగింది. మాకు పట్టున్న ప్రాంతాల్లో అది 36 శాతం వరకు ఉంది. రాష్ట్రం మొత్తం గత ఎన్నికలతో పోలిస్తే అది రెట్టింపు అయ్యింది. అయినప్పటికీ ఏ పార్టీ నోటి నుంచి నన్ను ముఖ్యమంత్రి చేయాలన్న మాట రాదు. బలం చూపించి పదవి తీసుకోవాలి తప్ప. కండీషన్లు పెడితే పని జరగదు. దానికోసం నేను పాకులాడను కూడా! ఈ వ్యవహారంలో శ్రీ మనోహర్ గారి వ్యాఖ్యలు వక్రీకరించి చెబుతున్నారు. అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వారు వాటిని ఉపసంహరించుకోవాలి. వన్ కండీషన్ సేఫ్ గార్డ్ టూ ఆంధ్రప్రదేశ్.. టూ టేక్ బ్యాక్ పవర్ ఫ్రమ్ వైసీపీ.. గివ్ బ్యాక్ పవర్ టూ పీపుల్ త్రూ అలయెన్స్.
- బలమైన సమూహంతో అసెంబ్లీకి వెళ్లాలన్నదే లక్ష్యం నా వరకు అందర్నీ కలుపుకుని వెళ్లిపోతాను. బీజేపీ – కమ్యూనిస్టులు పరస్పర వ్యతిరేక సిద్ధాంతాలతో ముందుకు వెళ్లే పార్టీలు. పొత్తుల వ్యవహారం ఓ కూటమిగానే ఉంటుంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమన్న మాట ఎన్నికల్లో ప్రభావం చూపగల పార్టీలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాం. పొత్తులు అంత తేలిక కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కూడా పొత్తులతోనే బలపడింది. అందరికీ ఎవరి బలమైన వర్గం వారికి ఉంటుంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననడానికి కారణం కూడా వైసీపీనే. నేను రాజకీయాల్లో అజాత శత్రువుగా ఉండటానికి రాలేదు. నా వరకు నిర్మాణాత్మక రాజకీయాలు ఇష్టం. అల్లర్లు చేయడానికి పార్టీ పెట్టలేదు. అసెంబ్లీలో బలమైన సమూహంతో వెళ్లాలన్న ఉద్దేశంతోనే రాజకీయ పార్టీ పెట్టాం.
- ప్రతి గింజా కొనే వరకు రైతులకు అండకొద్ది రోజులుగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు తూర్పు గోదావరి జిల్లా పర్యటన పెట్టుకున్నాం. కొన్ని నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించాం. ఐదు నియోజకవర్గాల రైతులతో నేరుగా మాట్లాడాం. ప్రకృతి వైపరీత్యాలకు ప్రభుత్వాన్ని దూషించడం మా లక్ష్యం కాదు. పాలకులు ఎంత త్రికరణ శుద్దిగా ఉన్నారన్నదే మా ప్రశ్న. రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన శాఖలు పని చేయడం లేదు. సాదకబాధకాలు తెలుసుకోవడం లేదు. దళారీ వ్యవస్థ వల్ల రైతాంగానికి నష్టం కలుగుతోంది. అర్ధం పర్ధం లేని మాటలు చెప్పి రైతు కష్టంలో కోత విధిస్తున్నారు. పంట వచ్చేసమయానికి దూరంగా ఉన్న మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఎడ్ల బండ్లలో పంట తీసుకు వెళ్తే బస్తాలు తీసుకోవడం లేదు. అకాల వర్షాలు వచ్చిన ప్రతిసారీ రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయ శాఖ, మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండకపోవడం వల్లే సమస్య వచ్చింది. పది రోజుల నుంచి బస్తాలు అడుగుతుంటే ఇవ్వలేదు. రాత్రికి రాత్రి మేము వస్తున్నామనగానే గోనె సంచులు ఇచ్చారు.
- రైతులు ఒకటే చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని దోచేస్తున్నారు.. జలగల్లా పట్టి పీడిస్తుందన్నదే అతి పెద్ద ఫిర్యాదు. మంత్రులు సహాయం చేయకపోగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే బాధ కలిగించింది. రైతులు సమస్యలపై వినతి పత్రాలు ఇద్దామంటే కేసులు పెట్టి స్టేషన్ బెయిల్స్ ఇచ్చి పంపుతున్నారు. పావలా వడ్డీకి రూ.25 వేలు రుణం ఇస్తే మేము ఎవరినీ అడగమని రైతులు వాపోతున్నారు.
- వ్యవసాయం పనులు వచ్చినప్పుడే ఉపాధి హామీ పనులు చేయిస్తున్నారు. మురుగు కాలువల వ్యవస్థని నిర్వీర్యం చేశారు. వ్యవసాయ శాఖ అసలు పని చేయడం లేదు. మా పర్యటన అన్న తర్వాత తొలకరి పంట డబ్బు వేశారు. ఆరు నెలలుగా ఆ డబ్బు వైసీపీ పథకాలకు వాడుకుంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పేరున్న ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ ప్రభుత్వం ఎండగట్టేసింది. పార్టీ తరఫున రైతులకు ఒకటే మాట ఇచ్చాం.
- పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసే వరకు జనసేన పార్టీ రైతులకు అండగా నిలబడుతుంది. అందుకోసం ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వైసీపీ పంచాయితీ రాజ్ వ్యవస్థను చంపేసింది. కేరళ తరహా పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. సర్పంచులతో సమావేశం సందర్భంగా అందుకు సంబంధించిన ప్రణాళికలు ప్రకటిస్తామ”న్నారు.
Also Read: Buddha Statue: బుద్ద విగ్రహం ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి? అక్కడ పెట్టుకుంటే మంచి జరుగుతుందా..?