AP Special Status: వైసీపీకి బిగ్ షాక్.. ప్రత్యేకహోదా పై తేల్చేసిన కేంద్రం..!
- By HashtagU Desk Published Date - 03:30 PM, Wed - 23 March 22

ఆంద్రప్రదేశ్ ప్రత్యేకహోదా పై కేంద్ర ప్రభుత్వం తేల్చిపడేసింది. తాజాగా పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోక్‌సభలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లోక్‌సబలో ఏపీకి ప్రత్యేకహోదా సంగతి ఏంటని ప్రశ్నించగా, అందుకు స్పందించిన కేంద్ర మంత్రి నిత్యానందరాయ్, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రశక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా 14వ ఆర్ధిక సంఘం చేసిన నసిఫార్సుల్లో ప్రత్యేక హోదా లేదని అందులో పేర్కొన్నారు.
ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చామని మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, నవ్యాంధ్రకు దక్కిన ముఖ్యమైన హామీ ప్రత్యేక హోదా అనే విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ప్రత్యక హోదా అంశం తారుమారైంది. మరోవైపు 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి.
ఏపీలో ఈ రెండు పార్టీలకు మధ్య పొత్తు ఉండడంతో, కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు జై కొట్టారు. దీంతో ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ సర్కార్ పక్కనబెట్టేసింది. అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రత్యేకహోదాపై పోరాటం చేసింది. 2019 ఎన్నికల నేపధ్యంలో నవరత్నాలతో పాటు ప్రత్యేక హోదా నినాదంతో వైసీపీ విజయం సాధించింది. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంటామని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని చెబుతూ వస్తోంది. ఇక ఇటీవల హోంశాఖ కూడా ఏపీ ప్రత్యేక హోదా లేదని స్పష్టం చేసింది.
అయినా వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రత్యేకహోదా అంశాన్ని సజీవంగానే ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల తిసభ్య కమిటీ మీటింగ్ అజెండాలో హోదా అంశాన్ని చేర్చడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. దీంతో రాష్ట్రానిక ప్రత్యేకహోదా రాబోతుందని, కేంద్ర ప్రభుత్వం అందుకు సుమఖంగానే ఉందని, వైసీపీ నేతలంతా జోరుగా ప్రకటనలు చేశారు. అయితే త్రిసభ్య కమిటీ అజెండాలో చేర్చిన సాయంత్రమే, కేంద్ర హోంశాఖ ప్రత్యేకహోదా అంశాన్ని తొలగించింది. అయితే ఇప్పుడు ఏకంగా లోక్‌సభ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశం అని, ఏపీకి హోదా అనేది ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్తం తేల్చి చెప్పింది. దీంతో ఎప్పటికైనా ప్రత్యేకహోదా సాధిస్తామని చెబుతున్న వైసీపీ నేతలకు ఇది ఊహించని షాకే అని, ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార వైసీపీ దూకుడుకు కాస్త బ్రేక్ వేసినట్టే అని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.