Minister Lokesh : ఏఐ అవకాశాల వినియోగంతో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది: మంత్రి లోకేశ్
Minister Lokesh : ఏఐ అవకాశాల వినియోగంతో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రతి వంద రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తున్నామన్నారు. పి-4 విధానాల అమలుతో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని తెలిపారు.
- By Latha Suma Published Date - 01:07 PM, Sat - 26 October 24

America Tour : ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి మంత్రి నారా లోకేశ్‌కుచేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి తెలుగు ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి లోకేశ్ శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ … ఏఐ అవకాశాల వినియోగంతో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రతి వంద రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తున్నామన్నారు. పి-4 విధానాల అమలుతో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు చేస్తున్నామని లోకేశ్ వివరించారు.
కాగా, ”ప్రపంచ ఐటీ రంగంలో తెలుగువారు ఓ వెలుగు వెలుగుతున్నారంటే అందుకు టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ముందుచూపు వల్లనే. భారత దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ హైటెక్ సిటీ పేరు చెప్పగానే చంద్రబాబు గుర్తుకు రాక మానరు. 2000 సంవత్సరంలోనే విజన్ 2020 అంటూ ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని అంచనా వేసిన విజనరీ లీడర్ చంద్రబాబు. ఆ క్రమంలోనే తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న మంత్రి లోకేశ్ 2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నారు” అని ఎన్నారై ప్రముఖులు కొనియాడుతున్నారు.
తన తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు ఐటీ రంగంపై చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక శ్రద్ధను కూడా లోకేశ్ పుణికి పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన నేటి నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో లోకేశ్‌కు ఘన స్వాగతం పలికేందుకు తెదేపా ఎన్నారై నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి ‘అఖండ’ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేశ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. తెదేపా ఘన విజయం సాధించడంతో పార్టీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. మంగళగిరి ఎన్నికల్లో ఆల్ టైం రికార్డు బద్దలు కొట్టి తిరుగులేని విజయం సాధించి మంత్రి అయిన లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఎన్నారై తెదేపా యూఎస్ఏ కో ఆర్డినేటర్ జయరాం కోమటి, ఎన్నారై తెదేపా మీడియా కో ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, స్థానిక తెదేపా నేతలు శశి దొప్పలపూడి, శ్రీకాంత్ దొడ్డపనేని, తెదేపా జోనల్ ఇన్‌ఛార్జి రవి మందలపు, ఐటి సర్వ్ ప్రతినిధులు వినోద్ ఉప్పు, సతీశ్ మండువ, సురేశ్ మానుకొండ తదితరులు ఉన్నారు.
అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి లోకేశ్ అమెరికాలో పర్యటిస్తారు. ఈనెల 29న లాస్‌వేగాస్ నగరంలో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు హాజరుకానున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా పలు ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహించే సభకు ఎన్నారై తెదేపా నేతలు, అభిమానులు, ఎన్నారైలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.