Social Media : సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే అంతే సంగతి – ఏపీ సర్కార్
Social Media : ప్రజల్లో అభద్రతా భావం కలిగించేలా తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై కొత్త చట్టాన్ని అసెంబ్లీలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు
- By Sudheer Published Date - 09:35 AM, Wed - 20 August 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై (Social Media Fake news) కఠిన చర్యలు తీసుకోనుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. ప్రజల్లో అభద్రతా భావం కలిగించేలా తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై కొత్త చట్టాన్ని అసెంబ్లీలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుండటంతో, ఆ విజయాలను తట్టుకోలేక ప్రతిపక్షం అసత్య ప్రచారాలు చేస్తోందని అనిత అన్నారు. ఒక్క ఆగష్టు నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నేతన్నలకు సాయం, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రారంభించామని గుర్తు చేశారు. ఇవన్నీ ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని, వాటిని ప్రతిపక్షం తప్పుగా చిత్రీకరిస్తోందని ఆమె పేర్కొన్నారు.
ISRO: 40 అంతస్తుల ఎత్తైన జంబో రాకెట్
అలాగే నెల్లూరు రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ అంశంపై కూడా మంత్రి అనిత స్పందించారు. ఆయనకు పెరోల్ ఇచ్చిన విధానంపై విచారణ జరుగుతోందని, క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి ఎలా పెరోల్ వచ్చిందనే దానిపై జైలు అధికారులు వివరణ ఇచ్చారని తెలిపారు. వెంటనే పెరోల్ రద్దు చేసి తిరిగి జైలుకు పంపించామని చెప్పారు. ఈ ఘటనలో సంబంధం ఉన్న పోలీస్ అధికారులు, ఇతరులపై కూడా దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే, అరుణ అనే మహిళ హోంశాఖ పేరుతో ఫోన్ చేసిన ఘటనపై కూడా పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, ఆమె వెనుక ఉన్న వారిని కూడా ఆరా తీస్తున్నామని అనిత తెలిపారు.