Train Accident : రైలు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
విజయనగరం జిల్లా కంటకపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
- Author : Prasad
Date : 30-10-2023 - 8:06 IST
Published By : Hashtagu Telugu Desk
విజయనగరం జిల్లా కంటకపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైలు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రమాద స్థలానికి రెస్క్యూ టీమ్‌లను పంపించామని, విద్యాశాఖ మంత్రి బి.సత్యనారాయణ, జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయ, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర మంత్రికి సీఎం జగన్ తెలిపారు. విజయనగరం సమీపంలో రాయగడ వెళ్లే ప్యాసింజర్ రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: YCP : బెజవాడలో వైసీపీకి షాక్.. త్వరలో జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి