AP Crisis : ఏపీ అభివృద్ధిపై భారీ కుట్ర, హైదరాబాద్ కేంద్రంగా రాజకీయ మాఫియా!
ఏపీ అభివృద్ధి మీద భారీ కుట్ర(AP Crisis) జరుగుతోంది.
- By CS Rao Published Date - 01:50 PM, Wed - 8 February 23

ఏపీ అభివృద్ధి మీద భారీ కుట్ర(AP Crisis) జరుగుతోంది. ఆ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేయడానికి హైదరాబాద్(Hyderabad) కేంద్రంగా గత కొన్నేళ్లుగా కొందరు పెద్దలు మాస్టర్ స్కెచ్ వేశారు. ఆ విషయాన్ని ఏపీలోని మేధావులు గమనించారు. ప్రత్యామ్నాయ మార్గం దిశగా వాళ్లు అడుగులు వేస్తున్నారు. మళ్లీ లోక్ సత్తా పార్టీని యాక్టివ్ చేయడం ద్వారా జయప్రకాష్ నారాయణను రంగంలోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, ముందుగా ప్రజల్లోకి వెళ్లి ఏపీ మీద జరుగుతోన్న కుట్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని మేధావులు భావిస్తున్నారని సమాచారం. రాష్ట్రాన్ని విడగొట్టడం నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను విశదీకరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఏపీ అభివృద్ధి మీద భారీ కుట్ర(AP Crisis)
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత జరిగిన పరిణామాలను ప్రజల ముందు ఉంచాలని సీనియర్ జర్నలిస్ట్ లతో కూడిన ఏపీ మేధావులు సిద్దమయ్యారని తెలుస్తోంది. ఆనాడు గవర్నర్ గా ఉన్న నరసింహన్ ఇచ్చిన నివేదిక, సీఎంగా రోశయ్య వ్యవహరించిన తీరు రాష్ట్ర విభజనకు(AP Crisis) బీజం వేసిందని అవలోకనం చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించకపోతే, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని ఆనాడు గవర్నర్ ఇచ్చిన నివేదిక గురించి మేధావులు ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల కారణంగా మైనార్టీలో పడిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని మూడేళ్ల పాటు ఎవరు నిలబెట్టారు? అనే అంశాన్ని కూడా తెరమీదకు తీసుకురావాలని భావిస్తున్నారట. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు ఇచ్చిన పార్టీలు విభజన సమయంలో ఏపీకి ఎలా న్యాయం చేయాలి? అనే అంశాన్ని కూడా తెలియచేయలేదు.
ఉమ్మడి ఏపీని పార్లమెంట్లో చీకటి కోణం నుంచి..
రాష్ట్రాన్ని ఎలా విభజించాలి? అనేది తెలియచేస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 గురించి వైసీపీ చెప్పింది. ఒక వైపు సమైక్యవాదాన్ని వినిపిస్తూనే రాష్ట్ర విభజనకు జగన్మోహన్ రెడ్డి ఆనాడు సహకరించారు. రెండు కళ్లు సిద్ధాంతాన్ని వినిపిస్తూ ఏపీని విడదీసేలా టీడీపీ అండగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ అధికార దాహం ఉమ్మడి ఏపీని పార్లమెంట్లో చీకటి కోణం నుంచి నిలువునా చీల్చింది. ఆ సమయంలో ఏపీ గురించి ఆలోచించిన లీడర్ గానీ, రాజకీయ పార్టీగానీ లేకపోవడం శోచనీయం. కేవలం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ లీడర్ వెంకయ్యనాయుడు రాజ్యసభ వేదికగా ఏపీ గురించి ఆలోచన చేసిన ఒకేఒక లీడర్. కానీ, వెంకయ్య చేసిన పోరాటం ఆయన కళ్లెదుట మోడీ సర్కార్ హయాంలో నీరుగారిపోయింది.
Also Read : Capital AP : విశాఖకు ఆర్బీఐ తరలింపు? శరవేగంగా రాజధాని హంగులు!
రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ, హైదరాబాద్ (Hyderabad)అభివృద్ధి గురించి అన్ని పార్టీలు, లీడర్లు ఆలోచించారు. ఏపీలో ఎన్డీయే కూటమి పాలన 2016 వరకు చంద్రబాబు హయాంలో నడిచింది. కానీ, విభజన హామీలు, షెడ్యూల్ 9,10 ఆస్తుల విభజన జరగలేదు. ఇప్పటికీ సుమారు 6లక్షల కోట్ల రూపాయల విలువైన ఏపీ సంపద తెలంగాణ కేంద్రంగా ఉంది. దాని గురించి ఏ ఒక్కరూ పోరాటం చేయడంగానీ, ప్రస్తావించడంగానీ జరగలేదు. ప్రత్యేకహోదా కోసం 2019 ఎన్నికలకు ముందుగా పోరాటం చేయడానికి రంగంలోకి దిగిన చంద్రబాబును ఏపీ ప్రజలు తిరస్కరించారు. అమరావతి రాజధాని కేంద్రంగా చోటుచేసుకున్న పరిణామాలు, కాపులకు రిజర్వేషన్ అంశాలు, జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆయన్ను అధికారం నుంచి దింపేశాయి. 2014 నుంచి 2019 మధ్య కాలంలో పరిపాలన కంటే తెలంగాణ, ఏపీ మధ్య జరిగిన రాజకీయ యుద్ధమే ఎక్కువగా కనిపించింది. ఇదే సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ తో కేసీఆర్ లైజనింగ్ చేసుకుని చంద్రబాబు రూపొందించిన విజన్ 2020 బాటన వేగంగా అడుగులు వేశారు.
తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి(Hyderabad)
స్వర్గీయ వైఎస్ తొలిసారి సీఎం అయిన 2004 నుంచి జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు, హైదరాబాద్(Hyderabad) కేంద్రంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేశారు. కేవలం ఐదేళ్ల కాలంలోనే ఆర్థికంగా ఆకాశానికి ఎదిగారు. ఆ విషయాన్ని టీడీపీ ఆధారాలతో సహా పలుమార్లు బయట పెట్టింది. ఆయన వ్యాపార సామ్రాజ్యం అంతా హైదరాబాద్ కేంద్రంగా విస్తరించింది. 2014 ఎన్నికల్లో ఏపీ ప్రజలు సీఎంగా చంద్రబాబును చేసినప్పటికీ ఆయన కుటుంబ వ్యాపారాలను ఏపీకి తరలించలేదు. ఉమ్మడి ఏపీ ఉండగా హైదరాబాద్ కేంద్రంగా చంద్రబాబు కుటుంబం వ్యాపారాలను పెంచుకుంది. అంతేకాదు, చంద్రబాబు సానుభూతిపరులు, అనుచరులు, పార్టీలోని పెద్దలు హైదరాబాద్ కేంద్రం పెద్ద ఎత్తున వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించారు. ఏపీలో ఏ ఒక్కరూ వ్యాపారాలను(AP Crisis) ప్రారంభించలేదు. అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత మాత్రమే చంద్రబాబుపై విశ్వాసం ఉన్న కొందరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు.
Also Read : AP Debts: ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ. 4,42,442 కోట్లు : తేల్చేసిన కేంద్రం
సీన్ కట్ చేస్తే, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అప్పటి వరకు చంద్రబాబు వేసిన అభివృద్ధి పునాదులను ప్రజావేదిక నుంచి కూల్చేయడం ప్రారంభించారు. అమరావతి ప్రాజెక్టును కాలగర్భంలో కలిసేలా చేశారు. ఫలితంగా సుమారు 6లక్షల కోట్ల రూపాయాలు పలు వర్గాలు, వర్ణాలు నష్టపోయాయి. రాష్ట్ర దివాలా దీసింది. పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ఏపీ వైపు చూడడంలేదు. ఆ రాష్ట్రాన్ని ఒక బీహార్ , శ్రీలంక లతో పోల్చుతూ మీడియా ప్రచారం హోరెత్తిస్తోంది. దీంతో బయట నుంచి చూసే వాళ్లు ఏపీ గురించి చులకనగా మాట్లాడుకోవడం వినిపిస్తోంది. ఫలితంగా హైదరాబాద్, తెలంగాణ సుభిక్షంగా కనిపిస్తోంది. కేసీఆర్ పాలన మీద పల్లెత్తి మాట అనడానికి కూడా దమ్ము, ధైర్యం ఉన్న ప్రధాన లీడర్ గానీ, పార్టీగానీ, మీడియాగానీ లేకపోవడం గమనార్హం. సరిగ్గా ఇక్కడే ఏపీ మీద కుట్ర కోణాన్ని(AP Crisis) గమనించాలి.
ఏపీలోని అధికార, విపక్ష పార్టీల లీడర్లకు హైదరాబాద్ కేంద్రంగా భారీగా ఆస్తులు
ఏపీలోని అధికార, విపక్ష పార్టీల లీడర్లకు చాలా మందికి హైదరాబాద్ కేంద్రంగా భారీగా ఆస్తులు ఉన్నాయి. వాటి విలువ గత ఎనిమిదేళ్లలో అమాంతం పెరిగింది. ఒక వేళ ఏపీ అభివృద్ధి పథాన వెళితే, ఆటోమాటిక్ గా హైదరాబాద్ లోని వాళ్ల ఆస్తుల విలువ భారీగా తగ్గుతుంది. అందుకే, వ్యూహాత్మంగా ఏపీని కుక్కలు చింపిన విస్తరిలా చేస్తున్నారని ఆ రాష్ట్ర మేధావుల భావన. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఆయన మీద ఉన్న కేసులు కూడా తెలంగాణ పరిధిలోని కోర్టుల్లోనే. ప్రతిపక్ష నాయకునిగా ఉన్నంత కాలంగా హైదరాబాద్ (Hyderabad లోని లోటస్ పాండ్ ను ఆయన వీడలేదు. ఆనాడు ఏపీ పోలీసులు, వైద్యులను ఆయన విశ్వసించలేదు. ప్రస్తుతం తాడేపల్లి లోని ఆయన క్యాంప్ ఆఫీస్ మినహా పెద్దగా ఆయనకు ఏపీలో ఆస్తులు, వ్యాపారాలు లేవు. ఆయన సంపద అంతా బెంగుళూరు, హైదరాబాద్ కేంద్రంగా ఉంది. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆస్తులు, అంతస్తులన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని సర్వత్రా తెలిసిన విషయమే.
Also Read : Jagan Tapping : ఏపీ పోలీస్ కు ఇరకాటం,జగన్ ప్రభుత్వానికి`ట్యాపింగ్ `సంకటం!
జనసేనాని పవన్ కల్యాణ్ ఆస్తులన్నీ హైదరాబాద్ (Hyderabad)లోనే ఉన్నాయి. పైగా ఒకానొక సమయంలో తెలంగాణలో పుట్టలేదని బాధపడుతున్నానంటూ వ్యాఖ్యానించారు. అంటే, ఏపీ మీద ఆయనకు ఉన్న మక్కువ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఏపీతో ఎలాంటి సంబంధంలేదని కామెంట్ చేశారు. ఇక మీడియా యాజమాన్యాలకు ఏపీ మూలాలు ఉన్నప్పటికీ కొన్ని దశాబ్దాల క్రితమే తెగదెంపులు చేసుకున్నారు. వాళ్లకు ఏపీలో ఓటు హక్కు కూడా లేదు. అంతేకాదు, ప్రస్తుతం ప్రధాన మీడియా వేదికలపై నుంచి ఏపీ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతోన్న ప్రజెంటర్లు చాలా వరకు ఏపీతో ఎలాంటి సంబంధంలేని వాళ్లే. ఇష్టానుసారం ఏపీ రాష్ట్రాన్ని కించిపరుస్తూ ప్రతిరోజూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదంతా ఏపీ మీద గత కొన్ని ఏళ్లుగా జరుగుతోన్న కుట్రగా మేధావులు ఇటీవల ఏర్పాటు చేసుకున్న మీటింగ్ లో ఒక అభిప్రాయానికి వచ్చారట. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజల్లో అవగాహన పెంచాలని నిర్ణయించారని తెలుస్తోంది.
ప్రధాన మీడియా వేదికలపై నుంచి ఏపీ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతోన్న ప్రజెంటర్లు
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ రాష్ట్రానికి స్థానికంగా ఉండే లీడర్ సీఎం కావాలని మేధావులు భావిస్తున్నారు. అయితే, రాజకీయంగా ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణను దించడం ద్వారా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. కానీ, ప్రస్తుతం ఆయన రాజకీయాలపై ఇంట్రస్ట్ గా లేడని తెలుస్తోంది. దీంతో ఏపీ మీద జరుగుతోన్న కుట్రను(AP Crisis) ప్రజలే తెలుసుకోవాలని మేధావులు కోరుకుంటున్నారట.

Related News

TSPSC: మరో పరీక్ష వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ.. జూన్ 17కు మార్పు..!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా మరో పరీక్షను వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను TSPSC వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.