Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం
- Author : Vamsi Chowdary Korata
Date : 04-07-2026 - 11:05 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన కుటుంబానికి చెందిన ఆస్తి వేలాన్ని సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన వేలం ప్రక్రియ చట్టబద్ధమేనని స్పష్టం చేస్తూ, రికవరీ చర్యలతో ముందుకు వెళ్లవచ్చని బ్యాంకుకు అనుమతినిచ్చింది. ఈ వేలాన్ని రద్దు చేస్తూ గతంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తాజాగా కొట్టివేసింది.
వివరాల్లోకి వెళ్తే.. బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా ఉన్న ‘శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ కోసం యూనియన్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలకు పూచీకత్తుగా జూబ్లీహిల్స్‌లోని షేక్‌పేట్‌లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని తాకట్టు పెట్టారు. ఈ రుణాలకు సంబంధించి కుటుంబ సభ్యులు వ్యక్తిగత హామీదారులుగా ఉన్నారు.
రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో, సర్ఫేసీ (SARFAESI) చట్టం కింద బ్యాంకు 2019లో ఆస్తిని స్వాధీనం చేసుకుని, 2022లో వేలం వేసింది. ఈ వేలంలో సదరు ఆస్తి రూ. 8.51 కోట్లకు విక్రయించబడింది. అయితే, ఈ వేలాన్ని డీఆర్టీ రద్దు చేయడంతో, యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ మౌషూమి భట్టాచార్య, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం, బ్యాంకు వాదనలతో ఏకీభవించింది. డీఆర్టీ ఉత్తర్వులను రద్దు చేస్తూ, బ్యాంకు చేపట్టిన వేలం ప్రక్రియ చెల్లుబాటు అవుతుందని శుక్రవారం తీర్పు వెలువరించింది. హైకోర్టు తాజా తీర్పుతో బ్యాంకుకు రికవరీ ప్రక్రియలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.