AP Cabinet: ఏపీ కొత్త మంత్రుల సెలక్షన్ లో ప్లాన్ A, ప్లాన్ B సిద్ధం! జగన్ ఓటు దేనికి?
- By hashtagu Published Date - 08:56 AM, Thu - 7 April 22

ఏపీ మంత్రివర్గాన్ని మొత్తం మారుస్తారా.. కొద్ది మందిని కొనసాగిస్తారా అన్నదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. కానీ ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ A, ప్లాన్ B రెండింటినీ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్లాన్ A ను చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యతను ఇవ్వడం. ఇక ప్లాన్ B ని చూస్తే.. వెనుకబడిన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి.. అగ్ర సామాజికవర్గాలకు కొద్దిపాటి ప్రాధాన్యతను ఇవ్వడం. ప్రస్తుతం ఈ రెండు ప్లాన్లలో ఏది అమలు చేస్తారు అన్నదానిపై ఇంకా వైసీపీ వర్గాలకు క్లారిటీ లేదు. కాకపోతే ఇందులో ప్లాన్ A వైపే జగన్ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
ఇక మంత్రివర్గం మొత్తాన్ని మారుస్తారని చెప్పలేం. ప్రస్తుత మంత్రుల్లో కొద్దిమందిని కొనసాగించే అవకాశం ఉంది. సీనియర్ మంత్రులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. వారిలో బొత్స, పెద్దిరెడ్డి, బుగ్గన, బాలినేనికి మరోసారి ఛాన్స్ ఇవ్వడానికి అధినేత సుముఖంగా లేరని సమాచారం. దీనివల్ల వారిలో అసంతృప్తి ఉంటుందని తెలిసినా.. జగన్ మాత్రం తాను అనుకున్నదే చేస్తారంటున్నారు విశ్లేషకులు.
ఇక ప్రస్తుత మంత్రుల్లో ఆదిమూలపు సురేశ్ ను కొనసాగిస్తారని తెలుస్తోంది. దీంతో తనకు మళ్లీ అవకాశం ఇవ్వకుండా సురేశ్ కు మరో ఛాన్స్ ఇవ్వడంపై బాలినేని అలిగినట్లు వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కర్నూలులో జయరాంతోపాటు మరో మంత్రి అయిన చెల్లుబోయిన వేణుగోపాల్, సీదిరి అప్పలరాజులను మళ్లీ కొనసాగించే అవకాశాలే ఎక్కువ. అధినేత ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇటు కొత్తగా ఎవరెవరికి అవకాశం వస్తుందని చూస్తే.. కృష్ణా జిల్లాలో జోగి రమేశ్, మొండితోక జగన్మోహన్ రావులకు ఇప్పటికే మంత్రిపదవులపై హామీ లభించినట్లు సమాచారం. గుంటూరులో విడదల రజని, శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు, తూర్పుగోదావరి జిల్లాలో కొండేటి చిట్టిబాబులకు మంత్రులుగా అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. కాకపోతే మంత్రులుగా ఎవరెవరికి ఛాన్స్ ఇస్తారు అన్నదానిపై ఈనెల 10వ తేదీ వరకు గోప్యత పాటించే అవకాశం ఉంది.