Alcohol Effect : వైసీపీ ఏలుబడిలో నాణ్యతలేని మద్యం.. 100 శాతం పెరిగిన కాలేయ వ్యాధులు !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల వ్యాధుల భారాన్ని విశ్లేషించడానికి సీఎం చంద్రబాబు నాయుడు(Alcohol Effect) సర్కారు ముగ్గురు వైద్యరంగ నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
- By Pasha Published Date - 01:43 PM, Sun - 11 May 25

Alcohol Effect : వైఎస్సార్ సీపీ పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ విక్రయాలు కొత్త పుంతలు తొక్కాయి. వాటిని చూసి మందుబాబులు మత్తులోనూ అవాక్కయ్యారు. ఆనాడు జగన్ సర్కారు తీసుకొచ్చిన లిక్కర్ బ్రాండ్లను చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ప్రముఖ మద్యం బ్రాండ్లను పక్కన పెట్టి.. లోకల్ బ్రాండ్లకు వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేయడం అందరినీ ఆశ్చర్యపర్చింది. అప్పట్లో ఆంధ్రా గోల్డ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్ విస్కీ, డేర్ హౌస్ బ్రాందీ, ఛాంపియన్ స్పెషల్ విస్కీ, హార్ట్స్ డిజైర్ విస్కీ వంటి లోకల్ మద్యం బ్రాండ్లు రాజ్యమేలాయి. మరోదారి లేక ఏపీలోని మందుబాబులు వీటినే కొని తాగేశారు. కట్ చేస్తే.. ఏపీలోని మందుబాబుల్లో లివర్ సంబంధిత వ్యాధులు పెద్దసంఖ్యలో బయటపడుతున్నాయి. 2014 – 2019లో సాగిన టీడీపీ పాలనా కాలంతో పోలిస్తే 2019 – 2024లో సాగిన వైఎస్సార్‌సీపీ పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధుల కేసులు 100 శాతం పెరిగాయట. ఈమేరకు వివరాలతో నిపుణుల ప్యానెల్ నివేదికను విడుదల చేసింది.
Also Read :Ceasefire Inside Story: పాక్ అణు స్థావరాలపై దాడికి సిద్ధమైన భారత్.. అందుకే సీజ్‌ఫైర్‌కు అంగీకారం
గణాంకాల్లో ఏముంది ?
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల వ్యాధుల భారాన్ని విశ్లేషించడానికి సీఎం చంద్రబాబు నాయుడు(Alcohol Effect) సర్కారు ముగ్గురు వైద్యరంగ నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తమ అధ్యయనం కోసం ఏపీలోని ఆరోగ్యశ్రీ చికిత్సల అధికారిక సమాచారాన్ని ఉపయోగించుకుంది. ఈక్రమంలో నిపుణుల ప్యానెల్ కీలక విషయాన్ని గుర్తించింది.
- టీడీపీ అధికారంలో ఉన్న 2014-2019 కాలంలో ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధుల కేసులు 14026 బయటపడ్డాయి. వైఎస్సార్ సీపీ పాలన సాగించిన 2019- 2024 కాలంలో ఈ తరహా వ్యాధుల కేసుల సంఖ్య 100 శాతం మేర పెరిగి 29,369కి చేరుకుంది.
- మద్యం వల్ల వచ్చే నాడీ సంబంధిత రుగ్మతల కేసులు కూడా 2014-19తో పోలిస్తే 2019-24లో 892 శాతం మేర పెరిగి 12663కి చేరుకున్నాయి. ఈ కేసులు టీడీపీ హయాంలో (2014 – 2019లో) కేవలం 1276 మాత్రమే ఉన్నాయి.
- ఈ గణాంకాలు ఆందోళన రేకెత్తించేలా ఉన్నాయని ఏపీ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు.
- ఆనాటి వైఎస్ జగన్ సర్కారు తయారీలో ఏమాత్రం నాణ్యతను పాటించని లోకల్ మద్యం బ్రాండ్లను విక్రయించినందు వల్లే మందుబాబుల్లో కాలేయం, మూత్రపిండాల వ్యాధుల కేసులు పెరిగాయని పరిశీలకులు అంటున్నారు.
Also Read :Who is DGMO: నేరుగా పాక్‌తో భారత డీజీఎంఓ చర్చలు.. డీజీఎంఓ పవర్స్, బాధ్యతలేంటి ?
ఏపీలో లిక్కర్ స్కాం.. రంగంలోకి ఈడీ
ఛత్తీస్‌గఢ్, బిహార్‌లలో జరిగిన లిక్కర్ స్కాంలపై ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో ఏపీలో జరిగిన లిక్కర్ స్కాంపై ఈ వారం ప్రారంభంలోనే ఈడీ మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. ఏపీ సీఐడీ విభాగం 2024లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసును నమోదు చేసింది.ఈ కేసులో ఆనాటి ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందా లేదా అనే దానిపైనా దర్యాప్తు చేయనున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో దాదాపు రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు నాయుడు సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ సన్నిహితుడు రాజ్ కసిరెడ్డిని సిట్ అరెస్టు చేసింది. దర్యాప్తు జరుగుతున్న కొద్దీ రానున్న రోజుల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.