Cable Bridge: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి!
ఈ ఐకానిక్ వంతెన దాదాపు 5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జి అమరావతిలోని రాయపూడి ప్రాంతాన్ని కృష్ణా నదికి అవతల ఉన్న ఎన్‌హెచ్-65పై ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడుతో అనుసంధానిస్తుంది.
- By Gopichand Published Date - 05:42 PM, Fri - 5 September 25

Cable Bridge: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధాని అమరావతికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి కృష్ణా నదిపై ఒక ఐకానిక్ కేబుల్ వంతెన (Iconic Cable Bridge) నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ బ్రిడ్జి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని అమరావతితో అనుసంధానిస్తుంది. ఈ ప్రాజెక్టును కేవలం ఒక వంతెనగా కాకుండా, ఒక కళాత్మక కట్టడంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు గాను ఇప్పటికే ఎంపిక చేసిన నాలుగు ప్రత్యేక డిజైన్లను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచి, వాటిలో ఒకటి ఎంపిక చేసేందుకు ఓటింగ్‌కు అవకాశం కల్పించింది.
ఈ వంతెన డిజైన్లు ఆధునిక ఇంజినీరింగ్‌తో పాటు స్థానిక కూచిపూడి కళను మిళితం చేయడం విశేషం. ఎంపికైన నాలుగు నమూనాల్లో మూడు డిజైన్లు కూచిపూడి నృత్యంలోని వివిధ భంగిమలను ప్రతిబింబిస్తాయి. నాలుగవ డిజైన్, అమరావతిని సూచించేలా ఆంగ్ల అక్షరం ‘A’ ఆకారంలో రూపొందించబడింది. ఈ డిజైన్లన్నీ అమరావతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురావాలని అధికారులు పేర్కొంటున్నారు.
Also Read: Harish Rao: లండన్‌లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు!
ప్రభుత్వం ఈ కేబుల్ వంతెన డిజైన్‌ను నిర్ణయించే అవకాశాన్ని ఏపీ ప్రజలకే కల్పించింది. దీని ద్వారా ప్రజలు తమ అభిరుచికి తగ్గ డిజైన్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను పొందుతారు. ఈ ప్రజాస్వామిక ప్రక్రియ ద్వారా ఎంపికైన డిజైన్ భవిష్యత్తులో అమరావతికి ఒక గుర్తుగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక కొత్త శోభను తీసుకురావడమే కాకుండా పర్యాటకంగా కూడా అమరావతిని ఆకర్షణీయంగా మార్చనుంది. బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
ప్రాజెక్టు వివరాలు
ఈ ఐకానిక్ వంతెన దాదాపు 5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జి అమరావతిలోని రాయపూడి ప్రాంతాన్ని కృష్ణా నదికి అవతల ఉన్న ఎన్‌హెచ్-65పై ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడుతో అనుసంధానిస్తుంది. ఇది విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి కొత్త రాజధానిని కలిపే ముఖద్వారంగా ఉపయోగపడుతుంది.ఈ వంతెన నిర్మాణం కోసం దాదాపు రూ. 760 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా.